కేంద్ర బడ్జెట్ 2025-26 వృద్ధిని వేగవంతం చేయడానికి, సమ్మిళిత అభివృద్ధిని అందించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. 2014 నుండి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వరుసగా 14వ బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటుకు సమర్పించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆమె నొక్కి చెప్పారు. ఆర్థిక మంత్రి రికార్డు స్థాయిలో 8వ వరుస బడ్జెట్ ప్రజెంటేషన్‌లో వ్యక్తిగత ఆదాయంపై భారీ వెసులుబాటు కల్పించారు. “వచ్చే ఐదేళ్లలో వృద్ధిని ఉత్తేజపరిచే అన్ని అంశాలను ఇందులో ప్రవేశపెడుతున్నాం” అని అన్నారు. వ్యక్తిగత ఆదాయం విషయానికి వస్తే
రూ. 4 లక్షల వరకు ఆదాయం (సంవత్సరానికి) పై పన్ను మినహాయింపు ఉంటుంది.
రూ. 4 నుంచి 8 లక్షల మధ్య — 5 శాతం (పన్ను)
రూ. 8 నుంచి 12 లక్షల మధ్య — 10 శాతం (పన్ను)
రూ. 12 నుంచి 16 లక్షల మధ్య — 15 శాతం (పన్ను)
రూ.16 నుంచి 20 లక్షల మధ్య — 20 శాతం (పన్ను)
రూ. 20 నుంచి 24 లక్షల మధ్య — 25 శాతం
రూ. 24 లక్షల పైన — 30 శాతం పన్ను ఉంటుంది.
కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు (రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్‌తో వేతనాలు పొందే పన్ను చెల్లింపుదారులకు రూ. 12.75 లక్షలు) వార్షిక ఆదాయానికి నిల్ ట్యాక్స్ స్లాబ్ వర్తిస్తుంది. వార్షిక ఆదాయం రూ. 18 లక్షలు ఉన్న వ్యక్తికి పన్ను రూపంలో రూ. 70,000, రూ. 25 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ. 1.10 లక్షల ప్రయోజనం లభిస్తుందని సీతారామన్ చెప్పారు.