అస్సాం రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (ROAD ASSET MANAGEMENT SYSTEM) విజయవంతంగా అమలవుతోందని, అత్యాధునికమైన పరికరాలతో రోడ్ల వివరాలను సేకరిస్తున్న తీరు ఆదర్శవంతంగా ఉందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. ఇటువంటి అత్యాధునిక విధానాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి అధికారులకు తెలిపారు.
రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (ROAD ASSET MANAGEMENT SYSTEM)పై సమగ్ర అధ్యయనం కోసం మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అస్సాంలో రెండు రోజుల పాటు సాగిన పర్యటన నేడు విజయవంతంగా ముగిసింది. మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా అస్సాంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది.
ముఖ్యంగా గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానమైన రోడ్లతో ప్రజలు అనునిత్యం పడిన అవస్థలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన రోడ్ల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఏ ప్రాంతంలోనైనా కనీస మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే పెట్టుబడులను ఆకర్షించడం.. తద్వారా అభివృద్ధి దిశలో అడుగులు పడటం జరుగుతుంది. అందుకనుగుణంగా నేడు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం & నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో అధునాతనమైన విధానాలను అవలంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు రచిస్తోంది.
దేశ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం & అభివృద్ధిలో అమలవుతున్న సరికొత్త విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు సమగ్ర అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గుజరాత్ లో పర్యటించిన మంత్రి ఆధ్వర్యంలోని బృందం తాజాగా అస్సాంలో రెండు రోజుల పాటు పర్యటించింది. తొలిరోజు మంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి అస్సాం పబ్లిక్ వర్స్క్ డిపార్ట్ మెంట్ అస్సాంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (RAMS) అమలు తీరుతెన్నులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించడం జరిగింది..
అలాగే గత రెండు దశాబ్దాలుగా అస్సాంలో రహదారుల నిర్మాణంలో సాధించిన పురోగతిని మంత్రి నేతృత్వంలోని బృందం తెలుసుకోవడం జరిగింది. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా అస్సాం రాష్ట్రంలో రోడ్ అసెట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (RAMS) ను విజయవంతముగా అమలుచేస్తున్న తీరుతెన్నులను ఈ బృందం క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించింది. మంత్రి నేతృతంలోని బృందం నెట్ వర్క్ సర్వే వెహికల్ ను సందర్శించడానికి అస్సాంలోని మీర్జాకు వెళ్లడం జరిగింది.
ఈ విధానం(RAMS)లో భాగంగా రోడ్ల వివరాలను నెట్ వర్క్ ద్వారా సేకరించడాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే రోడ్డు ఆస్తుల నిర్వహణ విధానంపై (RAMS) ప్రత్యక్ష డేటా సేకరణపై ప్రదర్శన కోసం అసోమ్ మాల కారిడార్ లోని “పలాస్ బారి- మిర్జా-చాందుబీ రోడ్డును” సందర్శించింది. అస్సాం మాల పథకం కింద అస్సాం ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక రోడ్డును మంత్రి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో తయారైనా హాక్ ఐ వెహికల్ మరియు అత్యాధునికమైన అమెరికాలో తయారైన పాత్ రన్నర్ వెహికల్ రెండింటినీ పరిశీలించారు.
ఈ వాహనంలో ప్రయాణించిన మంత్రి రోడ్ వివరాల సేకరణ ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే రోడ్డు రెసిడ్యువల్ స్ట్రెంగ్త్ కనుక్కునే పాలింగ్ వైట్ డిఫ్లెక్టోమీటర్ పనితీరును క్షేత్రస్థాయిలో మంత్రి స్వయంగా పరిశీలించారు. దీంతో పాటు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ వ్యవస్థ పనితీరును కూడా మంత్రి పరిశీలించారు. ఇటువంటి అత్యాధునికమైన పరికరాలతో రోడ్డు వివరాలను సేకరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన మంత్రి, ఇటువంటి విధానాల అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
అస్సాం పర్యటన విజయంతంగా పూర్తి చేసుకున్న అనంతరం మంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం రాష్ట్రానికి తిరుగుపయనమయ్యింది. ఈ పర్యటనలో మంత్రితో పాటు ఆర్ & బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, రిటైర్డ్ స్పెషల్ సీ ఎస్ శ్యామ్ బాబు, ఆర్ & బీ శాఖ ఈఎన్ సీ నయిముల్లా, ఏపీ ఎస్ హెచ్ ఆర్డీసీ ఛీప్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.