39.2 C
Hyderabad
March 29, 2024 16: 12 PM
Slider ముఖ్యంశాలు

ఏపి బడ్జెట్: పాత సీసాలో పాత సారానే

#raghurama1

పేదవాడితో ప్రయాణం చేస్తాను… పెత్తందారులతో యుద్ధం చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శుద్ధ అబద్ధం.  డబ్బున్న వారే పెత్తందారులు అనుకుంటే అంబానీ, అదాని ఎవరు?. అంబానీ, అదానీలతోనే జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్నారు. పేదలపై ముఖ్యమంత్రి చేస్తున్న  పోరాటం కళ్లకు కనబడుతోంది. ప్రజలపై ఈ ప్రభుత్వం దారుణమైన పన్నులను వేస్తోంది.

పడిపోతున్న ఆస్తుల విలువలు, పెరిగిపోతున్న ఆస్తి పన్నులను పరిశీలిస్తే, పెత్తందారులతో  ప్రయాణం, పేదలపై  యుద్ధమే జగన్మోహన్ రెడ్డి విధానమని స్పష్టమవుతుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆస్తిపన్నుకు తోడు ప్రజలపై చెత్త పన్ను కూడా విధించారు.

రకరకాల పన్నులతో ప్రజలని వేధిస్తున్నారు. రూపాయకు లభించే విద్యుత్ మీటర్ ను నాలుగు   రూపాయలకు బిగించి, మూడు రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. ఆ మీటర్ల కంపెనీ ఎవరిదో తెలియదు. ఎక్కడికక్కడ దోచుకో, దాచుకో, ఎవరికి పంచకు అన్నదే తమ విధానంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో కొంత పంచితే పంచవచ్చు.

దోచుకో,  దాచుకో స్కీం లో  యాక్టివ్ గా ఉంటూ పెత్తందారులతో సహవాసం చేస్తూ, వారికే పదవులను ఇస్తూ వారితోనే పోరాటం చేస్తున్నాను అని అంటే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు. పేదవారితో   కలిసి పని చేస్తాం… ఇదే మా ఎకనామిక్స్, అదే మా పాలిటిక్స్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అదే మా పాలిటిక్స్ అని చెప్పడం అర్ధం అయ్యింది. ఎకనామిక్స్ అని చెప్పడం వెనుక మేము ఇలాగే అబద్ధాలు చెబుతాం.

మీరు నమ్మాల్సిందే అని అర్థమా అంటూ  రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దాచుకున్న  పీఎఫ్ డబ్బులు దోచుకుంటున్నారు. మనం ఖర్చుపెట్టిన డబ్బులు ఎప్పటికీ వెనక్కి వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి ఉద్యోగులదని అన్నారు.

ఎక్కువ అప్పులు రాబట్టడానికే అంచనాల పెంపు

రాష్ట్ర బడ్జెట్ పాత సీసాలో పాత సారానే. అంతకుమించి ఏమీ లేదు. ఆశల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. 13 లక్షల కోట్ల రూపాయలు జి ఎస్ డి పి గా చూపించడం వెనుక, అధికంగా అప్పులను రాబట్టాలనే ఎత్తుగడ కనిపిస్తోంది. అంచనాలను ఇబ్బడి ముబ్బడిగా  పెంచి చూపెట్టడం అంతా మాయ అని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు 55 వేల కోట్ల రూపాయలను కేటాయించి, డిబిటి విధానం ద్వారా ప్రజలకు అందజేస్తామనే అబద్దాన్ని కూడా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాము చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మాలి అంటే , భగవంతుడి సహకారం కూడా కావాలని అనుకున్నారేమో. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సింహభాగం 21 వేల కోట్ల రూపాయల నిధులు పెన్షన్ల చెల్లింపులకు కేటాయించాలి.

గత నాలుగేళ్లుగా చెల్లించని కళ్యాణమస్తు పథకానికి 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తము ఇచ్చేది లేదు. ప్రభుత్వం విధించిన నిబంధనలను పరిశీలిస్తే, మహా అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చేయవచ్చు. గత ఏడాది ఆసరా ఎత్తివేశారు. ఈ ఏడాది బడ్జెట్లో  గారడీ చేయడానికి బహుశా నిధులు కేటాయించారు అనుకుంటా. 55 వేల కోట్ల రూపాయల నిధులను వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా అందజేస్తున్నామని చెబుతూనే, కులాల వారీగా వేరుగా నిధులను అందజేస్తున్నట్లుగా ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం  చేస్తున్నారని   రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

జనాభాలో అధిక శాతం ఉన్న కాపులకు 20 వేల కోట్ల రూపాయలు,  18 శాతం ఉన్న దళితులకు 22 వేల కోట్ల రూపాయలు, బీసీలకు కులాలకు  సంక్షేమ పథకాల ద్వారా అంద చేస్తున్న సహాయాన్ని, ప్రత్యేకంగా  కులాలవారీగా వేరుగా సహాయం  చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. బీసీలకు బీసీ బంధు, ఎస్సీలకు దళిత బంధు పేరిట సహాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎస్సీ బీసీలను ఆదుకోవడానికి  కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి.

ఆ పథకాలను సరిగ్గా అమలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇంత పెద్ద మొత్తం నిధులు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒకవైపు వినియోగించుకుంటూనే, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తామని చెబుతున్న 55 వేల కోట్ల రూపాయలలో కేవలం 14 నుంచి 15 వేల కోట్ల రూపాయలను మాత్రమే తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం  ఖర్చు చేస్తోంది.

ఈ పథకాల అమలుకు కేంద్రం నుంచి 60 శాతం నిధులను పొందుతూ, వాటికి దొంగ బిల్లులను, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను పెట్టి కేంద్ర ప్రభుత్వం పేరు లేకుండానే, అంతా తామే చేసినట్లు చెబుతున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు . ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో 60 శాతం  నిధులేమో కేంద్ర ప్రభుత్వానివి అయితే, పేరేమో 40% నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్నిదని తెలిపారు.

వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అమలకు 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా, అంతా తామే భరిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం బుఖాయింపులకు పాల్పడుతోంది. లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి లభిస్తున్నట్లుగా బడ్జెట్లో చూపెడుతూ, ఆ ఆదాయం లో నుంచి అలా, ఇలా ఖర్చు పెడుతున్నామని అప్పుల అంకెల గారడితో పెనుమాయ తప్పితే ఉన్నది ఉన్నట్టు చూపెడితే వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలియడం లేదన్నారు.

ఎవరైనా అడిగితే వారిపై కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. మనవారు కాకపోతే ప్రభుత్వానికి సరఫరా చేసినవారికి డబ్బులు ఇచ్చేది లేదు. రాష్ట్ర బడ్జెట్లో బాకీల ఊసే లేదు. లక్ష యాభై వేల కోట్ల రూపాయల బాకీలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ అప్పులు తీర్చాలంటే ఈ బడ్జెట్ సరిపోదు. సి ఎఫ్ ఎం ఎస్ వెబ్సైట్ పనిచేయదు.

వచ్చే ఆదాయం ఎక్కువగా చేసి చూపెట్టడం… చెల్లించాల్సిన డబ్బులను తక్కువగా చేసి చూపెట్టడమనేది ఎన్ని రోజులు. మాయమాటలతో, కుదిరితే తమకాల పరిమితిని అంతా ఏదో రకంగా గడిపేద్దామని  చూస్తున్నారు. ఈ వ్యవస్థలను ఎవరు కాపాడుతారనేది అర్థం కావడం లేదు. రాజ్యాంగ పరిరక్షకులైన పెద్దవాళ్లు పట్టించుకోవడం లేదు. జనం ఎన్నుకున్నారని అది వాళ్ళ కర్మ. వారి కర్మానికి వారినే వదిలేస్తే మళ్లీ అటువంటి తప్పు చేయరనే భావనలో కేంద్ర పెద్దలు ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎక్కువగా అప్పులు ఇచ్చి వదిలేస్తున్నారెమోననే అనుమానం కలుగుతోందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

దేశంలోనే అప్పులు చేసే ప్రజలు రాష్ట్రంలోనే ఎక్కువ

దేశంలోనే అప్పులు చేసే ప్రజలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నారని గణంకాలు చెబుతున్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో 168% మంది ప్రజలు అప్పులు తీసుకొని, పన్నులు కడుతున్నారు. ప్రజలను అప్పులపాలు చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. పేదవాళ్లందరినీ ధనవంతుల్ని చేస్తామని మోహన్ రెడ్డి, మనోహరంగా చెబుతుంటే పేదలు ఎందుకు అప్పులు చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

చిన్న మొత్తాలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అంటే పేదవాడు ధనవంతుడైనట్టా?, పేదవాడు మరింత పేదవాడైనట్టా?? అని ఆయన నిలదీశారు. ఇదే గణాంకాలను చూపెట్టి ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలని కోరారు. జనం వెర్రి వెధవలు  మనం చెప్పిన అబద్ధాలను గతంలో నమ్మారు… మళ్లీ చెబుదాం… మళ్లీ నమ్మిద్దాం  అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి ఉంది.

నమ్మని వారిని గుర్తించి  ఎన్నికలకు రాకుండా అడ్డుకోవాలని భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే దుర్మార్గులకే మంచి రోజులులాగా అనిపిస్తున్నాయి.  ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వారిపై ప్రభుత్వ పెద్దలు  కక్ష కట్టి తప్పుడు కేసులను  బనాయిస్తూ  వేధింపులకు గురి చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

108 దేవాలయాల్లో విడుదలైన శ్రీ లక్ష్మీ సహస్ర చిత్రం పాటలు

Satyam NEWS

ఖాకీ ఛీటింగ్: అమ్మాయిని ట్రాప్ చేసిన పోలీసు అధికారి

Satyam NEWS

ఫోర్ స్క్వేర్: చుక్కలు చూపిస్తున్న ఆ నలుగురు

Satyam NEWS

Leave a Comment