36.2 C
Hyderabad
April 23, 2024 22: 43 PM
Slider ప్రత్యేకం

ప్రభుత్వ సలహాదారుడు పార్టీ విషయాలు పర్యవేక్షించవచ్చా?

#raghurama letter

ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ ప్రశ్న వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో నిర్వచించాలని ఆ లేఖలో ఆయన కోరారు.

పార్టీ విషయాలూ, ప్రభుత్వ విషయాలూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డే మీడియాకు చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి రాజ్యాంగేతర శక్తుల వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని రఘురామకృష్ణంరాజు తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం:

ముఖ్యమంత్రి గారూ,

ప్రస్తుత రాజకీయాలలో విమర్శ అనేది సర్వ సాధారణం. ఎవరు ఎవరినైనా విమర్శించవచ్చు. అయితే విమర్శించే వ్యక్తి స్థాయిని బట్టి దానికి విలువ ఇస్తుంటారు, అవసరమైతే దానికి సమాధానం చెబుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి.

ఆయన ఏ విషయంపైన అయినా, ఏ సందర్భంలోనైనా, ఎవరినైనా వ్యాఖ్యానించే సాహసవంతుడే. అయితే ఆయనకు అలా మాట్లాడాలని ఎవరు చెబుతారో, ఆయనకు ఎవరు సూచనలు ఇస్తారో ఎవరికీ తెలియదు. ‘‘లోగుట్టు పెరుమాళ్ల కెరుక’’. ప్రతిపక్ష పార్టీలతో సహా ఎవరూ కూడా ఆయన చేసే విమర్శలను సీరియస్ గా తీసుకోవడం లేదు, సమాధానం కూడా చెప్పడం లేదు.

ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా మారిపోయారని ప్రజలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. మంత్రులను కించపరుస్తుంటారు. ప్రభుత్వ కార్యకలాపాలలో పార్టీ కి సంబంధించిన విషయాలను తీసుకువస్తుంటారు.

పాలనావ్యవహారాలన్నింటిపైనా తీవ్ర ప్రభావం చూపించాలని ఆయన అనుకుంటూ ఉంటారు. సలహాదారుడిగా ఆయన ఏం చేయాలి? ఆయనకు ఉన్న బాధ్యతలు ఏమిటి అనే అంశాలు మాత్రం ఆయనకు తెలియవు. ఆయన తనకున్న అధికారం మొత్తాన్ని విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఆయన తన ప్రాముఖ్యతను పెంచుకోవడానికి అధికారాన్ని అడ్డంపెట్టుకుంటున్నారని పార్టీ వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి.

ఆయన అప్రకటిత హోం మంత్రిగా చెలాయిస్తున్న అధికారం కూడా ఇప్పటికే పలువురికి కంటగింపుగా ఉంది. ఆయన తన హోదాకు తగ్గట్టుగా ప్రభుత్వ ధనాన్ని జీతంగా తీసుకుంటున్నారు. పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ ఆయన పార్టీ హోదాలో కొనసాగరాదు.

ఇటీవల, ఒక శుభదినాన, ఆయన తాత్కాలిక ఆవేశంలో నోరు జారి, తాను ప్రభుత్వ సలహాదారుడినే కాదు నాలుగు జిల్లాలకు ఇన్ చార్జిగా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నాను అని చెప్పేశారు. ఈ అమాయకత్వం క్షంతవ్యం కాదు.

ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ ధనం నుంచి జీతం తీసుకుంటూ పార్టీ బాధ్యతలు నిర్వర్తించే వీలులేదు. ఆయన ఇదే విధంగా ప్రభుత్వ వ్యవహారాలు మాట్లాడుతూ ఉండాలి… అని మీరు గట్టిగా అనుకుంటే మీరు ఒక పని చేయవచ్చు. అతనిని శాసన వ్యవస్థ లోకి తీసుకురండి. పెద్దల సభకు నామినేట్ చేయడమో లేక శాసనసభ టిక్కెట్ కేటాయించి ఎన్నికలలో నిలబెట్టి గెలిపించుకోవడమో చేయండి.

ఆ తర్వాత ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుని ప్రభుత్వ వ్యవహారాలను మాట్లాడనివ్వండి. అంతే కానీ ఇప్పుడు చేస్తున్నట్లు అనుమతించడం ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహాసం చేయడమే అవుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవ పరచడమే అవుతుంది.

మంత్రి వర్గంలో అందరూ సమానులే కానీ ముఖ్యమంత్రి మరింత ఎక్కువ సమానుడు అనేది మూల సూత్రం కాగా మీరు ఎప్పుడూ మీడియా ముందుకు రాకపోవడం, బహిరంగ సభలలో కూడా తరచూ కనిపించకపోవడంతో ఆయనకు ఎక్కువ అవకాశం దొరుకుతున్నది. ఆయన తరచూ… అంటే వీలైనన్ని ఎక్కువ సార్లు మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. 

మీరూ, మంత్రులూ సమానులే అయినప్పటికీ మీరు చెప్పాల్సిన విషయాలతో బాటు మంత్రులు అధికారికంగా ప్రకటించాల్సిన అంశాలను కూడా ఆయన యథేచ్ఛగా చెప్పేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తాము ఎన్నుకున్న తమ ప్రతినిధులు మాట్లాడాలి అనుకుంటారు తప్ప మీరు మీ ఇష్టానుసారం ఎవరో ఒకరిని అంటే ప్రజాప్రతినిధి కానివారిని ఎంపిక చేసుకుని వారితో మాట్లాడిస్తాను అంటే ప్రజలు సహించే వీలు ఉండదు.

ఎంతో అద్భుతమైన ప్రతిభ, అర్హత కలిగిన నిపుణుడు అయిన అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తిని నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంచుకుని మీరు సజ్జలతో ఆయన తరపున మాట్లాడించడం, అదీ కూడా నీటిపారుదల లాంటి కీలకమైన అంశాలను చెప్పించడం సబబుగా లేదు.

ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం కాదు. ఇది ప్రతి శాసన సభ్యుడి గుండెల నిండా నిండిపోయిన అభిప్రాయం. మిమ్మల్ని కలవాలంటే ఆయన నుంచి అప్పాయింట్ మెంట్ తీసుకోవాల్సి రావడం మరో దురదృష్టకరమైన అంశంగా ఆ ప్రజాప్రతినిధులు తీవ్రమైన మనోవేదన అనుభవిస్తున్నారు. కొన్ని సందర్భాలలో అయితే ఆయన అప్పాయింట్ మెంట్ కోసమే ప్రయత్నించాల్సి రావడం మరింత దురదృష్టకరమైన అంశంగా వారు అనుకుంటున్నారు.

వీటన్నింటికన్నా వారిని బాధిస్తున్న విషయం ఏమింటే ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకునే వ్యక్తి అనుమతి తీసుకుంటే తప్ప తమ మనుగడ లేదనే విషయాన్ని భరించడం. ఇలా ప్రభుత్వ జీతం తీసుకునే వ్యక్తి కోసం ప్రజాప్రతినిధులమైన తాము పడిగాపులు కాయడం అనేది ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా అవుతుందని వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.

అందుకే ఆయన బాధ్యతలు, ఆయన పోషించే పాత్రపై మాకు మీరు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. పోనీ మాకు కాకపోయినా ఆయన వ్యవహారాలపై ఆయనకైనా స్పష్టత ఇవ్వడం మంచిదేమో ఆలోచించండి. ఆయన స్వయంగా చెప్పుకున్నట్లు ఆయనే కనుక కొన్ని జిల్లాల పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి అయితే ఆయన అధికారికంగా పోలవరం ప్రాజెక్టు సైట్ ను తనిఖీ చేయడం ఏమిటి? అదే విధంగా కృష్ణా నదీ జలాల వ్యవహారంపై ఆయన మాట్లాడటం ఏమిటి? ఆయన ప్రభుత్వ సలహాదారుడు అని మీరు అనవచ్చు.

ఆయన ప్రభుత్వ సలహాదారుడు అయితే మీకు సలహాలు ఇవ్వమనండి లేదా నీటిపారుదల శాఖ మంత్రికి సలహాలు ఇవ్వమనండి. అంతే కానీ నేరుగా వచ్చి మీడియాతో మాట్లాడే అధికారం ఆయనకు ఉండదు. అదీ కూడా నీటిపారుదల శాఖ మంత్రి అజమాయిషీలో ఉండే సాగునీటి వ్యవహారాలు, నీటి సంబంధిత విషయాలు ఇలా ఆయన చెప్పడం సబబు కాదు.

మీరు మీకు ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన వారిని అప్పాయింట్ చేసుకోవడంపై ‘‘ తాను వలచినది రంభ, తాను మునిగినది గంగ’’ అనే సామెతను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ తీరుగా చేయడం తీవ్ర ఆక్షేపణీయం. ఎవరికైనా వ్యక్తిగతంగా మేలు చేయాలని మీరు భావిస్తే మీ వ్యక్తిగత హోదాలో ఏమైనా చేసుకోండి. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు గౌరవించాలి తప్ప ఈ విధంగా దుర్వినియోగం చేయకూడదు.

ఆయన సామర్ధ్యంపై మీకు అత్యంత గొప్ప నమ్మకం ఉంటే ఆయనను మీకు సలహాలు ఇచ్చేవరకూ పెట్టుకోండి. అందుకు ఆయన పాత్రను పరిమితం చేయండి. లేదూ ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అని భావిస్తే ఆయనను చట్టసభలకు పంపి ఆ తర్వాత ఆయనకు మీరు అనుకునే బాధ్యతలు అప్పగించండి.

మీరు క్రమం తప్పకుండా మీడియాకు మొహం చాటేస్తుండటంతో ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యామ్నాయంగా చెలామణి అవుతూ మీ పాత్రను కూడా పోషిస్తున్నారు. మీరు ఇదే విధంగా ఆయనతో ద్విపాత్రాభినయం చేయిస్తుంటే ఎవరో ఒకరు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం తో న్యాయస్థానాల గడప తొక్కవచ్చు. తిరుగులేని ప్రజాదరణ ఉన్న గొప్ప నాయకుడైన మీ ఇమేజి కి అప్పుడు భంగం కలగవచ్చు.

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

నీట్, ఐఐటీ-జేఈఈ 2021 గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS

ఐ‌టి రంగం ద్వారా 10 లక్షల మందికి ఉపాధి

Murali Krishna

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం

Satyam NEWS

Leave a Comment