32.7 C
Hyderabad
March 29, 2024 10: 42 AM
Slider ప్రత్యేకం

రఘురామ: కంట్లో నలుసు, చెప్పులో రాయి, చెవిలో జోరీగ

#ysjaganmohan

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు గతంలో రచ్చబండ అనే కార్యక్రమం నిర్వహించే వారు. రచ్చ బండ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేసేవారు.

ఈ విమర్శలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు, మరి కొందరు మారుపేర్లతో సోషల్ మీడియాలో దారుణంగా ప్రతిస్పందించేవారు. దానికి రఘురామకృష్ణంరాజు అంతే దీటుగా సమాధానాలు చెప్పేవారు.

ఈ మొత్తం వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టేవరకూ వెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో బెయిల్ పై వచ్చిన రఘు రామకృష్ణంరాజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.

(సుప్రీంకోర్టు రచ్చబండ గురించి చెప్పలేదు కానీ మీడియా ముందుకు ఆ కేసు విషయాలు చెప్పవద్దని షరతు విధించింది)

కారణం ఏదైనా రఘురామకృష్ణంరాజు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. రఘురామకృష్ణంరాజు రచ్చ బండ కార్యక్రమాన్ని రెగ్యులర్ గా ప్రసారం చేసే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానెళ్ల ను కూడా దేశద్రోహం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహ నిందితులుగా చేర్చింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో బెయిల్ పై వచ్చిన రఘురామకృష్ణంరాజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించకపోవడంతో ఈ రెండు ఛానెళ్లు కూడా రెగ్యులర్ గా రఘురామకృష్ణంరాజు ను ఛానెల్ లో చూపించడం లేదు.

ఇదంతా తమ విజయమే అని మరి కొందరు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ తలచుకుంటే ఎవరైనా కట్టడిలో ఉండాల్సిందే అర్ధం అయింది కదా మా పవర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేసుకున్నారు.

నిజమే కాబోలు అనేలోపు జరుగుతున్న పరిణామాలు అలా గర్వంతో తల ఎగరేసిన వారికి చెమటలు పట్టిస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు పెడుతున్న కేసులు, దేశంలోని అన్ని పార్టీల ఎంపిలకు (వైఎస్ఆర్ కాంగ్రెస్ మినహా) దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు (ఏ పి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మినహా) రాస్తున్న లేఖలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

దీంతో ఆయనను ఇంత కాలం వ్యతిరేకించిన వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఎంపీ ర‌ఘురామ‌కు పెరుగుతున్న ఎంపీల‌ మ‌ద్ద‌తు వారికి నిద్రను దూరం చేస్తున్నాయి. ఏపీ సీఐడీ అధికారులు త‌న‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారంటూ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు స‌హ‌చ‌ర ఎంపీల‌కు రాసిన లేఖ‌ ప‌ట్ల ఆయ‌న‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది.

ఒడిశాలోని పూరి ఎంపీ, బిజూ జ‌న‌తాదళ్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత పినాకి మిశ్రా ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తు తెలిపారు. సీఐడీ అధికారులు ర‌ఘురామ ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరును ఖండించిన ఆయ‌న.. గాయాల‌తో కూడిన ఎంపీ ఫొటోలు దిగ్భ్రాంతికి గురి చేశాయ‌న్నారు.

అంత‌కుముందు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్‌, మండ్యా ఎంపీ సుమ‌ల‌త‌, కేర‌ళ ఎంపీ ప్రేమ్ చంద్ర‌న్, మ‌రో ఒడిశా ఎంపీ చంద్ర‌శేఖ‌ర్ సాహూ వంటి స‌హ‌చ‌రులు ర‌ఘురామ ప‌ట్ల ఏపీ సీఐడీ తీరును తీవ్రంగా ఖండించారు.

ఒక పార్ల‌మెంటెరియ‌న్ ప‌ట్ల ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని.. పార్ల‌మెంట్‌లో ఈ అంశాన్ని లేవ‌నెత్తుతామ‌ని స్ప‌ష్టం చేశారు. భాజ‌పా ఎంపీ, నీటి పారుద‌ల వ్య‌వ‌హారాల స్థాయి సంఘం ఛైర్మ‌న్ సంజ‌య్ జైస్వాల్ కూడా ర‌ఘురామ లేఖ‌పై స్పందించారు.

ఎంపీపై దాడి త‌న‌ను బాధించింద‌ని వివ‌రించారు. ఘ‌ట‌న‌పై పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తాన‌న్నారు. ఈ విష‌యాన్ని మెయిల్ ద్వారా సంజ‌య్ జైస్వాల్ ర‌ఘురామ‌కు తెలిపారు. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ రఘురామ లేఖ పై స్పందించారు. 

ఇలా పెరుగుతున్న మద్దతు రఘురామ వ్యతిరేకులకు దడ పుట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చూసి ఏం చేయాలో రఘురామ వ్యతిరేకులకు అర్ధం కావడం లేదు. దీనికన్నా రచ్చబండే బెటర్ అని వారు అనుకుంటున్నారు.

రచ్చ బండ కేవలం తెలుగులోనే ఉండటం వల్ల జాతీయ స్థాయిలో అది చర్చనీయాంశం కాలేదు. ఇప్పుడు రఘురామ ఇంగ్లీష్ తో బాటు హిందీ లో కూడా ఎంపిలకు లేఖలు రాయడంతో ఏపిలో జరుగుతున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా తెలుస్తున్నాయి.  

Related posts

జగన్ రెడ్డి ప్రభుత్వంపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

ముంబయిలో విదేశీ కరెన్సీ పట్టివేత..

Bhavani

సూదిని జైపాల్ రెడ్డి: రాజకీయ గురువు కు ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment