కన్నడ సినీనటి నుంచి భారీ ఎత్తున బంగారు కబడ్డీలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకున్నది. సంచలనం కలిగిస్తున్న ఈ ఘటన బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. కన్నడ నటి రన్యారావు నుంచి రూ.12.56 కోట్లు విలువైన బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బుధవారం వెల్లడించింది. రన్యారావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు కుమార్తె అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ కేసులో మొత్తం స్వాధీనం చేసుకున్నది రూ. 17.29 కోట్లు. ఇందులో రూ. 4.73 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నాయి. మిగిలింది బంగారు కడ్డీల రూపంలో ఉన్నది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరు విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో 14.2 కిలోల బంగారాన్ని పట్టుకోవడం ఇదే తొలిసారి. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12.56 కోట్ల విలువైన విదేశీ మూలం బంగారు కడ్డీలను తీసుకెళ్తున్న ప్రయాణికురాలిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) విజయవంతంగా అడ్డుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
“నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారంతో, DRI అధికారులు మార్చి 3న ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుండి బెంగళూరుకు వచ్చిన సుమారు 33 సంవత్సరాల వయస్సు గల భారతీయ మహిళా ప్రయాణీకురాలిని అడ్డగించారు. పరిశీలించినప్పుడు, 14.2 కిలోల బరువున్న బంగారు కడ్డీలు పట్టుబడ్డాయి” అని పేర్కొంది. DRI ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. కస్టమ్స్ చట్టం, 1962లోని నిబంధనల ప్రకారం రూ.12.56 కోట్ల విలువైన నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
“ఇంటర్‌సెప్షన్‌ను అనుసరించి, DRI అధికారులు బెంగళూరులోని లావెల్లే రోడ్‌లో ఉన్న ఆమె నివాస ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు, ఆమె తన భర్తతో కలిసి నివసిస్తుంది. ఈ సోదాల్లో రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2.67 కోట్ల విలువైన భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు” అని పేర్కొంది. కస్టమ్స్ చట్టం, 1962లోని సంబంధిత నిబంధనల ప్రకారం ఆమెను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.