ఆకలితో పస్తులుంటున్న ఆర్టీసీ కార్మికులు దీపావళి పండుగ రోజు కూడా తమ నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. ఆర్టీసీ కార్మికులు 22వ రోజు కూడా కొల్లాపూర్ ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జెఏసీ కొల్లాపూర్ కన్వీనర్ నరసింహ, జేఏసీ కో కన్వీనర్ రామయ్య, భాస్కర్, శేఖర్, ఎం.మధు తదితరులు హాజరయ్యారు. పండుగ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు ధర్నా చేయడం పలువురిని కన్నీరు పెట్టించింది. ఎంతో ఆనందంగా దీపావళి పండుగ చేసుకోవాల్సిన ఆర్టీసీ కార్మికులు సమ్మె కారణంగా ఉద్యోగం ఉందో లేదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. వారి ఆవేదన అంతా ఇంతా కాదు. అందుకే పండుగ, ఆదివారం సెలవు దినం అని కూడా చూడకుండా కొల్లాపూర్ ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేశారు. ఆంధ్రా సిఎం మంచి వాడని ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాడని అయితే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక మాట చెప్పి ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని వారు అన్నారు. ఉద్యమ సమయంలో తామంతా ఎన్నో త్యాగాలు చేస్తేనే తాను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయి అహంకారంతో మాట్లాడుతున్నాడని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.
previous post