ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం 6గంటలకు డిపోల వద్దకు చేరి విధులకు హాజరు కావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
అశ్వద్దామ రెడ్డి పిలుపునిచ్చారు. 52రోజులు సుదీర్ఘ పోరాటం చేశామని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి సంస్థ ను నిర్వీర్యం చేసిందని ఆయన అన్నారు. నిర్భందాలు చేసినా సమ్మెలో భాగంగా చేసిన పోరాటాలను కార్మికులు విజయవంతం చేశారని ఆయన అన్నారు. దేశంలో దొంగలు పడ్డట్టు.. ఆర్టీసీ ఆస్తులను కొందరు స్వాహా చేశారని ఆయన అన్నారు. కొంతమంది అధికారులు ఆర్టీసీ ని అమ్ముకునే ప్రయత్నం చేశారని అశ్వద్దామ రెడ్డి అన్నారు. నైతిక విజయం మనదే.. కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలవలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. దశలవారిగా తమ పోరాటం కొనసాగుతుందని అశ్వద్దామ రెడ్డి అన్నారు. యాజమాన్యం, ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా సంస్థ లో అంతర్గతంగా మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అందువల్ల కార్మికులు దాన్ని అడ్డుకునేందుకు డిపోలకు వెళ్ళి విధులకు హాజరవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. విధులకు తీసుకోక పోతే ఉదృతంగా పోరాటం కొనసాగిస్తాం అని ఆయన అన్నారు.