28.7 C
Hyderabad
April 24, 2024 05: 42 AM
Slider సంపాదకీయం

పవనిజం: బట్టబయలైన ఏపీ బీజేపీ విభేదాలు

#somuveeraju

పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో చిచ్చు రగుల్చాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు బీజేపీ ఇప్పటి వరకూ రూట్ మ్యాప్ ఇవ్వలేని స్పష్టం చేయడంతో దీనికి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అంటూ బీజేపీలో అంతర్గతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూట్ మ్యాప్ ఇవ్వకపోవడం వల్లే పవన్ కల్యాణ్ తెలుగుదేశం వైపు చూశారనేది బీజేపీలో మెజారిటీ అభిప్రాయం.

పవన్ కల్యాణ్ తో కలిసి పని చేయడం ఆది నుంచి ఇష్టం లేని విధంగానే సోము వీర్రాజు వ్యవహరించారు. బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన చిరంజీవితో భేటీ కావడంపై చూపిన శ్రద్ధ పవన్ కల్యాణ్ తో మాట్లాడేందుకు చూపలేదు. ఆ నాటి నుంచి కూడా పవన్ కల్యణ్ కు దూరం దూరంగానే సోము వీర్రాజు వ్యవహరించారు. సోము వీర్రాజు జనసేనను దూరం పెట్టేందుకు చాలా పనులు చేసినట్లు జనసేన పార్టీ వర్గాలు కూడా చాలాసార్లు అంతర్గతంగా మదనపడ్డాయి.

తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఈ విషయం పూర్తిగా బయటపడ్డది. జనసేన పూర్తిగా సహకరించినా కూడా సోము వీర్రాజు పట్టించుకోలేదు. సోము వీర్రాజు సాధారణంగా ఏ విషయం మాట్లాడినా అధికార వైసీపీతో బాటు తెలుగుదేశం పార్టీని కూడా టార్గెట్ చేస్తుంటారు. సోము వీర్రాజే కాకుండా ఆయన వర్గానికి చెందిన వారంతా కూడా వైసీపీతో సఖ్యత ఉన్నట్లుగానే ప్రవర్తించేవారు.

బాబు వ్యతిరేకులే సోము చుట్టూ….

చంద్రబాబునాయుడిని వ్యక్తిగతంగా విమర్శించే వారే సోము వీర్రాజుతో అంటకాగేవారు. దాంతో సోము వీర్రాజు వైసీపీతో సఖ్యతగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధిష్టానానికి కూడా ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. సోము వీర్రాజుకు తోడు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా చంద్రబాబునాయుడినే ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. వైసీపీని కాపాడే విధంగా జీవీఎల్ నరసింహారావు ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బీజేపీకి చెందిన కేంద్ర నాయకులు వైసీపీని విమర్శిస్తే వైసీపీ వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేది. అలా తమ సొంత నాయకులను వైసీపీ టార్గెట్ చేసినా కూడా సోము వీర్రాజు గానీ జీవీఎల్ నరసింహారావు గానీ పట్టించుకునే వారు కాదు. వారిద్దరూ మాట్లాడే సమయంలో చంద్రబాబునాయుడిని టార్గెట్ చేయడం వైసీపీకి ఆనందం కలిగించేది. గతంలో బీజేపీ కేంద్ర నాయకుడు రామ్ మాధవ్ వ్యవహారంలో ఇలా జరగడంతో ఆయన ఎంతో మనస్తాపం చెందారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వైసీపీపై విమర్శలు చేసినప్పుడు, సత్యకుమార్ పై వైసీపీ వ్యక్తిగతంగా విమర్శల దాడి చేసింది. సత్యకుమార్ ను చంద్రబాబు మనిషిగా అభివర్ణించారు. అయినా సరే బీజేపీ నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు. మరీ ముఖ్యంగా వైసీపీని విమర్శించే పరిస్థితి లేదు. అదే వైఖరిని ఇప్పటికీ ఈ ఇద్దరు నాయకులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బయటకు వెళ్లే పరిస్థితి రావడంతో ఈ విభేదాలన్నీ ఒక్క సారిగా భగ్గు మన్నాయి.

బీజేపీలో కొత్తగా చేరిన నాయకులు అందరూ కూడా సైలెంట్ కావడానికి కారణం కూడా వీరిద్దరే అనే వాదనలు బీజేపీలో బలంగా వినిపించాయి. కొత్తగా బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వారు మౌనంగా ఉండిపోవడానికి కారణం కూడా సోము వీర్రాజు, జీవీఎల్ ద్వయమేననే విషయం కూడా బీజేపీలో చర్చ జరుగుతున్నది.

అంతే కాకుండా బీజేపీ నాయకురాలు దగ్గుబాటు పురందేశ్వరి కూడా అంత సౌఖ్యంగా లేరని చర్చ వినిపిస్తున్నది. అయితే క్రమశిక్షణ గల బీజేపీ నాయకులు ఈ విషయాలను ఎక్కడా బయటకు చెప్పలేదు. బీజేపీలో నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బ‌య‌ట‌ప‌డ్డాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై మాజీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ విమ‌ర్శల‌కు దిగారు. త‌మ నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్ దూరం కావ‌డానికి సోము వీర్రాజే కార‌ణ‌మ‌ని ఆయ‌న ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు.

కరెక్టుగా డీల్ చేసి ఉంటే…..

సోము వీర్రాజు మంచిగా డీల్ చేసి వుంటే ప‌వ‌న్ టీడీపీ వైపు వెళ్లేపోయేవారు కాద‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. వీర్రాజుపై బ‌హిరంగంగానే క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ ఫైర్ కావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ముఖ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వీర్రాజుపై క‌న్నా త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కారు. బీజేపీని దాదాపు వీడి, టీడీపీతో ప‌వ‌న్ జ‌త క‌ట్ట‌డాన్ని ఎలా చూస్తార‌నే ప్ర‌శ్న‌కు క‌న్నా త‌న‌దైన రీతిలో సోము వీర్రాజుపై నెపాన్ని నెట్టారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను స‌మ‌న్వ‌య‌ప‌రచుకోవ‌డంలో ఏపీ బీజేపీ నాయ‌క‌త్వం విఫ‌ల‌మైంద‌న్నారు. వీర్రాజు వైఖ‌రి వ‌ల్లే ప‌వ‌న్ బీజేపీకి దూర‌మ‌య్యార‌ని ఆయ‌న నేరుగానే చెప్పారు. స‌మ‌స్య అంతా వీర్రాజుతోనే అని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు విమ‌ర్శించారు. బీజేపీలో ఏం జ‌రుగుతున్న‌దో త‌మ‌కే తెలియ‌డం లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీ బ‌లోపేతానికి హైక‌మాండ్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. పార్టీ వ్య‌వ‌హారాల‌న్నీ సోము వీర్రాజు ఒక్క‌డే చూసుకుంటుండ‌డంతో స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంద‌ని విమ‌ర్శించారు.

ఏపీలో ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఏకం కావాల‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో పొత్తుల విష‌యాన్ని తాను చెప్ప‌లేన‌ని, అది జాతీయ నాయ‌క‌త్వం చూసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ విమర్శలతో ఒక్క సారిగా బీజేపీలో ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి.

Related posts

అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభం

Satyam NEWS

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు

Satyam NEWS

పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment