దేశ రక్షణ కోసం అహర్నిశం శ్రమిస్తున్న మన దేశ సైనికులు వారి కుటుంబాల సంక్షేమం ఇతివృత్తంగా చిరుగుపాటి క్రియేషన్స్ బ్యానర్ పై చిగురుపాటి సుబ్రమణ్యం దర్శకత్వంలో నిర్మించిన దేశభక్తి పూరిత ‘సలామ్ సైనికా’ చిత్రం టైలర్ ను ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సలామ్ సైనికా చిత్రం దేశం లోపల వెలుపలా శత్రువులతో పోరాడి మరణించే మన సైనికుల విషయంలో ప్రతి భారతీయుడు ఎటువంటి బాధ్యతతో ఉండాలనే ఇతివృత్తంతో కూడినదని చెప్పారు.
శత్రువులతో పోరాడే సమయంలో దురదృష్ట వశాత్తు ఎవరైనా సైనికులు చనిపోతే దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని దేశ ప్రజలు పూర్తిగా గుర్తించి అలాంటి కుటుంబాలు నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత దేశ పౌరులమైన మనందరిపైనా ఉందనే విషయాన్ని గుర్తు చేసే రీతిలో ఈచిత్ర నిర్మాణం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈసినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్రీకరించారని దీనిలో 200 మంది వరకూ కొత్త నటీనటులు నటించారని అన్నారు. ఈ చిత్రంలో కధానాయకులుగా దేవ్,సాయి మరియు సురేశ్ నంటించగా కధానాయికలుగా శ్రీభవ్య,సోనీ రెడ్డి నటించారని తెలిపారు.
మన రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండి వారు దేశ సరిహద్దుకు వెలుపల, లోపల అహర్నిశం శ్రమించి కాపాడడంతోనే మనం ఇంత ప్రశాంతంగా జీవనం సాగించ గలుతు తున్నామని అందుకు ప్రతి ఒక్కరూ మన సైనిక వ్యవస్థకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని సూచించారు.మన దేశ సైకనికులపై రూపొందించిన ఈసలామ్ సైనికా చిత్రాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటున్నట్టు తెలిపారు. సలామ్ సైనికా చిత్ర దర్శకుడు చిగురుపాటి సుబ్రమణ్యం మాట్లాడుతూ భారత సైనికులు అహర్నిశలు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనలను కాపాడుతున్నారని వారికి మన వంతుగా కలిసి సహాయపడాలనే ఉద్దేశ్యంతో ఈచిత్రాన్ని రూపొందించినట్టు తెలిపారు.
సైనికులు చనిపోయినప్పుడు వారి భార్య పిల్లలు అనాధలు అవుతున్నారని వారికి అండగా వుండే బాధ్యత ప్రతీ భారతీయుడు తీసుకోవాలని సలామ్ సైనిక సినిమాలో ఆవిషయాన్నే తెలియ చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి కె.రఘురామ కృష్ణ రాజు,20 సూత్రాల కమిటీ చైర్ పర్శన్ లంకా దినకర్,రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి,అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్న కుమార్,అసెంబ్లీ అధికారులు,సలామ్ సైనికా చిత్ర ప్రతినిధులు పాల్గొన్నారు.