39.2 C
Hyderabad
March 29, 2024 14: 13 PM
Slider సంపాదకీయం

Salute: న్యాయానికి ప్రతి రూపం జస్టిస్ రాకేష్ కుమార్

#JusticeRakeshKumar

న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయి జీవితాన్ని గడిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ నేడు పదవి విరమణ చేయబోతున్నారు. ఏ న్యాయమూర్తి అయినా పదవి విరమణ చేయడం వార్త కాకపోవచ్చు కానీ జస్టిస్ రాకేష్ కుమార్ పదవి విరమణ మాత్రం కచ్చితంగా వార్తే.

రాష్ట్రంలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ రాకేష్ కుమార్ పై యుద్ధం ప్రకటించింది. ఆయనను అత్యంత దారుణంగా అవమానపరిచే విధంగా ప్రవర్తించింది. జస్టిస్ రాకేష్ కుమార్ ఎదుటకు కేసులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఆయనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసింది.

న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులను చూసి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తప్పులు సరిదిద్దుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు. న్యాయమూర్తులపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారు. అదే విధంగా ప్రవర్తించారు. న్యాయస్థానాలతో ప్రభుత్వం పోరాటం ఏమిటో అర్ధం కాదు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో న్యాయాన్యాయాలను పరిశీలించి తీర్పు చెబుతారు. అలా తీర్పు చెప్పడం వెనుక దురుద్దేశం ఉందని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధం కాదు. దురుద్దేశం ఉందని, దానివెనుక చంద్రబాబునాయుడు ఉన్నాడని ప్రచారం చేయడంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ ప్రజలు హైకోర్టు తీర్పులను సీరియస్ గా తీసుకోవడం లేదు. హైకోర్టు ఇచ్చే తీర్పులన్నీ చంద్రబాబునాయుడు, జస్టిస్ ఎన్ వి రమణ వెనకనుండి ఇప్పిస్తున్నవిగానే భావిస్తున్నారు. న్యాయవ్యవస్థకు రాజకీయాలు ఆపాదించడంలో జగన్ మోహన్ రెడ్డి కృతకృత్యం కావడం అత్యంత విషాదకరం.

 న్యాయవ్యవస్థ లో లోపాలను ప్రశ్నించేవారు ఎక్కువ కావడం మరో విషాదం. ఈ విషాదాల నేపథ్యంలో న్యాయవ్యవస్థ ప్రతిష్ట మంటగలసిపోయిందనడంలో సందేహం లేదు.

దిష్టిబొమ్మలు, నల్లజెండాలతో అవమానపరిచారు

‘నేను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో నా బంగ్లా నుంచి హైకోర్టు వెళుతుంటే కొందరు ప్రజలు ప్లకార్డులు పట్టుకుని, చేతులు జోడించి రోడ్డుపక్కన నిలబడేవారు. వారు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నవారని తెలిసింది.

ఆ తర్వాత అలాంటి ప్రదర్శనలు, కార్యక్రమాలేమీ నా కంటికి కనిపించలేదు. కానీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన కేసులపై హైకోర్టు ఫుల్‌బెంచ్‌ విచారణ ప్రారంభించనుందనగా హైకోర్టుకు వెళ్లే దారిలో మందడం వద్ద టెంట్‌ వేసి కొందరు వ్యక్తులు కూర్చునేవారు.

హైకోర్టు న్యాయమూర్తులకు దిష్టిబొమ్మలు, నల్లజెండాలు చూపించేవారు. వారంతా మూడు రాజధానులకు అనుకూలురని తెలిసింది. అక్కడ అధికార పార్టీ నాయకుల పోస్టర్లు, బ్యానర్లు ఉండేవి. నెల రోజులకుపైగా ఆ కార్యక్రమం కొనసాగుతోంది.

కొన్ని రోజులకు వారి కార్యక్రమాల ఉద్ధృతి పెరిగి న్యాయమూర్తుల్ని, మరీ ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తిని అగౌరవపరిచే స్థాయికి చేరింది. ఆ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీకి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ లేఖ రాశారు’ అని జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు.

ధనబలం, కండబలం ఉన్నవారు ఏం చేసినా చెల్లుతుందా?

ధనబలం, కండబలం ఉన్న వారు ఏం చేసినా చెల్లుతుందనే విపరీత ధోరణి వ్యవస్థలో ప్రబలింది. రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం చాలా కష్టంగా మారిందని చెప్పడానికి నేనేమీ సంశయించడం లేదు. రాజ్యాంగంలోని 21, 22 అధికరణలు పౌరులకు కల్పించిన హక్కులను రాష్ట్రంలో దారుణంగా ఉల్లంఘిస్తున్నారు అని కూడా జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యానించే పరిస్థితి రాష్ట్రంలో ఉంది.

పదవీ విరమణ చేసే రోజు కూడా మనశ్శాంతి లేకుండా…..

బిల్డ్‌ఏపీ కేసుకు సంబంధం లేని అప్రస్తుత అంశాలను, రికార్డుమీదకు రాని విషయాలను జస్టిస్ రాకేష్ కుమార్ ఆర్డర్‌కాపీలో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. మా లీగల్‌ టీం సర్టిఫైడ్‌ కాపీలకోసం ఫైల్‌చేసింది. విచారణకోసం వచ్చిన కేసు ఒకటైతే, జడ్జిగారు తీర్పులో పేర్కొన్న అంశాలు ఈ కేసుకు సంబంధం లేనివి. బహుశా వ్యక్తిగత దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు అవి.

కాబట్టి ఈ అప్రస్తుత ప్రసంగంమీద, అసందర్భ వ్యాఖ్యలమీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఇంతకుముందు ఇచ్చిన పలు తీర్పుల్లోని అంశాలను, ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందో, ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందో ఇక్కడ గుర్తుచేస్తున్నాను.

జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు హైకోర్టు స్థాయిని, హైకోర్టు న్యాయమూర్తుల స్థాయిని, న్యాయవ్యవస్థ స్థాయిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయిని తగ్గించేలా ఉన్నాయి. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాలను సవాల్‌చేస్తూ చేసిన వ్యాఖ్యలు చాలా ఆందోళనకరం అంటూ  ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తాజాగా వ్యాఖ్యలు చేశారు.

న్యాయమూర్తుల బాధ్యతా ఉంది

‘నా పదవీకాలం చివరి రోజుల్లో నా నిష్పాక్షికతను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రశ్నించింది. దానికి వివరణ చెప్పాలి కాబట్టే అన్నీ రికార్డు చేస్తున్నాను. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని పరిరక్షించడమే నా లక్ష్యం. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా, సచ్ఛీలంగా, నిజాయతీగా, పక్షపాతరహితంగా ఉండాలన్న భావనకు కొంత విఘాతం కలగడానికి మేం కూడా కొంత కారణమే.

చాలా సందర్భాల్లో న్యాయమూర్తులుగా పదవీవిరమణ చేసిన వెంటనే వారికి వేరే పోస్టు లభిస్తోంది. కనీసం ఏడాది పాటైనా అలాంటి పదవులేమీ తీసుకోకుండా మేం సంయమనం పాటించాలి. అప్పుడు మమ్మల్ని ఎవరూ ప్రభావితం చేయలేరు’ అని జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు.

ఇలాంటి నిష్పక్షపాతమైన అభిప్రాయాలు ఉన్న జస్టిస్ రాకేష్ కుమార్ తన పదవి కాలం చివరలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పని చేసినందుకు కచ్చితంగా చింతిస్తూ ఉంటారు. జస్టిస్ రాకేష్ కుమార్ కు జరిగిన ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒక న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పేందుకు వెనకడుగు వేస్తే………????

Related posts

ఎవరు అడ్డుపడ్డా అడ్డంకులు దాటి…..

Satyam NEWS

లాల్ దర్వాజా బోనాల జాతర.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

Bhavani

హిందువుల పట్ల విద్వేషం కక్కుతున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment