31.2 C
Hyderabad
June 20, 2024 22: 18 PM
Slider ముఖ్యంశాలు

సంకట హర గణేశుడి జన్మవృత్తాంతం

1536735140-0135

గణపతి గురించి అనేక పురాణగాథలు ఉన్నాయి. వివిధ యుగాలలో గణపతి ఆవిర్భావ సమయాల్లో వివిధ పేర్లతో పూజలందుకున్నట్లు తెలుస్తోంది. వివిధ పురాణాలలో గణపతి పుట్టుకను గురించిన ప్రస్తావనలున్నాయి. స్కంధ, వామన, పద్మ పురాణాలు, శివరహస్యం, తైత్తిరియోపనిషత్తు గణపతి గజ ముఖుడుగానే జన్మించినట్టు చెబుతున్నాయి. గణపతికి ఎలుకే కాకుండా నెమలి, సింహం, సర్పం కూడా వాహనాలు అని గణేశపరమైన ముద్గల పురాణం చెబుతోంది.  శివ పురాణం, వరాహ పురాణం, బ్రహ్మవైవర్త పురాణాల్లో గణపతి పుట్టుకకు సంబంధించిన విచిత్రమైన గాథలెన్నో వున్నాయి.

గజాస్య యోజనాయాశ్చ కారణం శృణు నారద

గోప్యం సర్వపురాణేషు వేదేషు చ సుదుర్లభం

తారణం సర్వదు:ఖానాం కారణం సర్వసంపదాం

హారణ మాపదాం చైవ రహస్య పాపమోచనం

వినాయకునికి గజముఖం ఏర్పడడం వెనుక గాథను నారాయణ మహర్షి బ్రహ్మవైవర్త పురాణంలో నారదునికి బోధించాడు. వినాయక జనన గాథను వినడం సర్వదు:ఖాలను పోగొట్టి సంపదలను కలిగిస్తుందని కూడా ఆయన చెప్పాడు. పురాణ గాథ ప్రకారం శివపార్వతుల వివాహం తరువాత దేవతలకు ఒక అనుమానం తోచింది. జగదేక పూజ్యులైన శివపార్వతులకు పుత్రులు కలిగితే తమ ప్రాబల్యం తగ్గిపోతుందనిపించింది. అందుకే వారి ఏకాంతానికి భంగం కలిగించాలనుకున్నారు. అలా శివపార్వతుల శృంగారానికి ఆటంకం కలగడంతో శివవీర్యం క్రిందపడి, దానినుంచి ఒక బాలుడు ఉద్భవించాడు. విచిత్రంగా శివుడా బాలుణ్ణి చూడగానే అతడి శిరస్సు ముక్కలైపోయింది. అప్పుడు శివుడు ఉత్తరం దిక్కుగా తలపెట్టుకుని నిద్రిస్తున్న ఏనుగు తలను తెచ్చి ఆ బాలుని మొండానికి అతికిస్తాడు. ఆ విధంగా ఆ బాలుడు గజాననుడయ్యాడు. అతనికి భార్య పేరు పుష్టి.

గణపతి ప్రశస్తి  అత్యంత ప్రాచీనమైనది. అన్ని యుగాలలోనూ భిన్నమైన రూపాల్లో గణపతి అవతరించినట్లు ఉంది. కృతయుగంలో అదితి కశ్యపుల పుత్రునిగా అవతరించినప్పుడు మహోత్కటునిగా జన్మించి దేవాంతక, నరాంతకులనే రాక్షసులను వధించాడు. త్రేతాయుగంలో గణపతి మయూరేశునిగా జన్మించినప్పుడు ఆయనకు నెమలి వాహనం అయ్యింది. బ్రహ్మ కుమార్తెలయిన సిద్ధి, బుద్ధిలను వివాహం చేసుకోగా క్షేముడు, లాభుడు అనే పుత్రులు కలిగారు. ద్వాపరయుగంలో గణపతిని గజాననుడన్నారు. సింధురాసురుడనే రాక్షసుణ్ణి సంహరించాడు. కలియుగంలో గణపతిని ప్రధానంగా ధూమ్రకేతువుగా అర్చించాలంటారు. ఈయనది అశ్వవాహనం. కలౌ చండీ వినాయకౌ అనే సూత్రం ప్రకారం కలికల్మష నాశకుడైన గణపతి ఈయనే.  గణపతిని మహాగణపతిగా అర్చిస్తారు. ఆ మహాగణపతి ఆవిర్భావ గాథ బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది. లలితా పరాభట్టారిక భండాసురునితో యుద్ధం చేస్తుంది. భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత అయిన లలితాదేవికి అవరోధం కల్పించడానికి సర్వవిఘ్నయంత్రాన్ని నిర్మిస్తాడు రాక్షసుడు. అప్పుడామె కామేశ్వరుని వంక చూసి… విఘ్ననాశకునిగా మహాగణేశుని కల్పిస్తుంది.  ఆయన భండాసురుడు నిర్మించిన విఘ్నయంత్రాన్ని భేదిస్తాడు.   

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్

భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుష్కామార్ధసిద్ధయే

జీవితంలో సంకటాలను తొలగించి అభివృద్ధిని కలిగించే సంకటహర గణేశ స్తోత్రాలు మనకు ప్రధానంగా రెండు పురాణాల్లో కనిపిస్తున్నాయి. నారదపురాణంలో నారదుడు చేసిన గణేశ స్తోత్రం మొదటిది కాగా రెండోది వరాహపురాణంలో కనిపిస్తుంది. గజాననుడు గణనాయకునిగా అభిషిక్తుడైన భాద్రపద శుద్ధ చవితినాడు ఇంద్రాది దేవతలు చేసిన స్తోత్రం రెండోది. ఈ పురాణంలో వినాయకుని పుట్టుకను గురించిన గాథ చిత్రమైనది. ఒకప్పుడు భూలోక వాసులైన రుషులు, మునులు కైలాసానికి వెళ్లారు. పరమశివుణ్ణి దర్శించి, ‘మహాదేవా! మా తపస్సులకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అరిషడ్వర్గాలు రాక్షసులకంటే ఎక్కువగా మమ్మల్ని బాధిస్తున్నాయి’ అంటూ మొరపెట్టుకున్నారు. వారి మాటలు విన్న శివుడు మహాట్టహాసం చేశాడు. నవ్వుతున్న శివదేవుని నోటి నుంచి ఒకబాలుడు పుట్టాడు. జగన్మోహన సుందరాకారుడైన ఆ బాలుని చూసి పార్వతితో సహా అందరూ ఆకర్షితులయ్యారు. దానితో కోపించిన శివుడు ఆ బాలుడిని, ‘ఏనుగు ముఖంతో, బానపొట్టతో, సర్పాలను జంధ్యాలుగా ధరించి’ బతకమని శపిస్తాడు. ఇంకా కోపం తగ్గని రుద్రుని స్వేదం నుంచి అనేకమంది పుట్టారు. వారందరూ ఏనుగు తలలతో ఉన్నారు. శాంతించిన తరువాత శివుడు వరమిస్తూ, తన నోటినుంచి పుట్టిన బాలునికి మిగిలిన వారిపై ఆధిపత్యం ఇచ్చాడు. ప్రతికార్యంలోనూ విఘ్నాలు వాటిల్లకుండా ముందుగా గజాననుడు పూజలందుకుంటాడని వరం ఇచ్చాడు.

నమస్తే గజ వక్త్రాయ నమస్తే గణనాయక

వినాయక నమోస్తుతే నమస్తే చండ విక్రమ….అంటూ ఇంద్రాది దేవతలు గణనాయకుని స్తోత్రం చేశారు.

పార్వతీ దేవి పిండిబొమ్మకు ప్రాణంపోయడం, శివుడు శిరస్సు ఖండించడం, ఏనుగు తల అతికించడం, గణనాయకునిగా పట్టంకట్టడం వంటి అందరికీ తెలిసిన గాథ శివపురాణంలో, స్కాందపురాణాలలో ప్రముఖంగా కనిపిస్తుంది. బ్రహ్మాండ పురాణం లక్ష్మీదేవి చరిత్రతో పాటు గణపతి ప్రస్తావన ఉంటుంది. అన్ని పురాణాలూ భాద్రపద శుద్ధ చవితిని విశేష తిధిగా పేర్కొన్నాయి. ఖగోళంలో ముంజేయి ఆకారంలో కనిపించే హస్తానక్షత్రం గణపతి తొండంలా కనిపించే కారణంచేత వినాయక నక్షత్రంగా ప్రసిద్ధి కెక్కింది. విగతో నాయక: యస్య స: …. అని వ్యాఖ్య. తనపై మరొకరి పెత్తనం లేని స్వతంత్రదైవం వినాయకుడు. ఆయుష్షు, బుద్ధి, యశస్సు, కవిత్వం, ఐశ్వర్యం, భుక్తి, ముక్తి అన్నీ గణపతి ఆరాధనతో సమకూరుతాయి.

Related posts

పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి

Satyam NEWS

ఓ గాడ్: శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అక్రమాలు

Satyam NEWS

ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లిస్తున్న జగన్ సర్కార్

Satyam NEWS

Leave a Comment