పోలీసులు లంచం అడుగుతున్నారా? లేదా పోలీసులతో మరేదైనా సమస్య ఉందా? పోలీసులే అన్యాయం చేస్తుంటే ఎవరితో చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? ఇక ఆలోచించాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చేసేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులలో అవినీతికి పాల్పడేవారిని పట్టిచ్చేందుకు కొత్త ఫోన్ నెంబర్ ను ఆయన ప్రవేశపెట్టారు. హైదరాబాద్ పోలీసులు అవినీతికి పాల్పడితే 9490616555 కు ఫోన్ చేయండి. వెంటనే పోలీసు అధికారులు స్పందిస్తారు. అవినీతికి పాల్పడే వారిని పట్టుకుంటారు.
అయితే ఇలా చేయడం వల్ల మీకు ఏదైనా సమస్య వస్తుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ నెంబర్ కు సమాచారం ఇచ్చే వారి పేర్లు ఫోన్ నెంబర్లు గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదుదారుడి వివరాలు ఎవరికి చెప్పకుండా కమిషనర్ అంజనీకుమార్ ఏర్పాట్లు చేశారు. నిన్న అవినీతికి పాల్పడిన జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ బల్వంతయ్య ను సస్పెండ్ చేస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. ఆయనను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే. పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చే ఇలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని ఈ సందర్భంగా అంజనీకుమార్ ప్రకటించారు.