సత్యం న్యూస్, అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన న్యూస్ పోర్టల్స్ లో ఒకటి. ప్రారంభించిన మూడు నెలల్లోనే ఇంతటి స్థాయికి రావడం నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. వాస్తవాలకు అద్దం పట్టే విశ్లేషణలతో, కొత్త పంథా వార్తలతో మీకు చేరువైన ఆనందం పూర్తిగా అనుభవించేందుకు సాంకేతిక సమస్య అడ్డుగా నిలిచింది. ఊహించని ఈ పరిణామానికి నేను సన్నద్ధంగా లేను. దాంతో ఒక్క సారిగా మీకు నాకూ మధ్య అగాధం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలు సాధించబోతున్నదని అంచనా వేసి ఎగ్జిట్ పోల్స్ నాడు వెల్లడించింది సత్యం న్యూస్. అందరూ అనుకుంటున్నట్లు కాకుండా తెలంగాణ పార్లమెంటు ఎన్నికలలో ఐదు స్థానాలను టి ఆర్ ఎస్ కోల్పోబోతున్నదని ముందే చెప్పింది సత్యం న్యూస్. ఇలా ఒక్కటేమిటి ఏపిలో ప్రచారం ముగిసిన వెంటనే వై ఎస్ జగన్ ఏ తేదీన ఎన్నిగంటలకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారో చెప్పింది సత్యం న్యూస్. ఏపి మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం లభించబోతున్నది కూడా వెల్లడించింది సత్యం న్యూస్.
ప్రధాన మీడియా విచ్చలవిడి వెకిలితనాన్ని వెలికితెచ్చాం
ఏపిలో పోలింగ్ ముగిసి కౌంటింగ్ మొదలయ్యే లోపు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యంపై అవాకులు చెవాకులు రాస్తున్న మీడియాకు ఎదురొడ్డింది సత్యం న్యూస్. వివరణ ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న ఎల్ వి సుబ్రహ్మణ్యంపై విచ్చలవిడిగా అభూత కల్పనలతో అసత్య ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు వారి స్థాయిని గుర్తుచేసింది సత్యం న్యూస్. తెలంగాణ ఇంటర్ రిజల్సులో గోల్ మాల్ చేసిన కంపెనీ గ్లోబరీనా అంటూ ముందుగా బయటపెట్టింది సత్యం న్యూస్. తిరుమల తిరుపతి బంగారంపై గానీ, అక్కడి అప్పటి చైర్మన్ చేసిన నిర్వాకాలపైన గానీ వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది సత్యం న్యూస్. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి చారిత్రక కథనాలను కళ్లకు కట్టింది సత్యం న్యూస్. చారిత్రాత్మక రిట్జి హోటల్లో అమానుషంగా నెమళ్లను చంపిన విషయాలను వెలుగులోకి తెచ్చింది సత్యం న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం హయాంలో జరిగిన ఎన్నో అవినీతి కార్యకలాపాలను సత్యం న్యూస్ వెలుగులోకి తెచ్చింది. రైతు సాధికార సంస్థలో జరిగిన లోపాలను బయటపెట్టింది. అవినీతితో అంటకాగేవారిని వెంబడించాం. మానవత్వాన్నితట్టిలేపాం. రాజకీయంగా జరగబోతున్న కీలక అంశాలను ప్రజల ముందు ఉంచాం.
అచిర కాలంలోనే అప్రతిహత విజయాలు
ఇలా ఒక్కటి కాదు. అచిర కాలంలోనే అప్రతిహత విజయాలను సాధించింది సత్యం న్యూస్. రామోజీరావుతో చంద్రబాబు నాయుడు భేటీ అయి కొన్ని విషయాలు చర్చించారు. వారిద్దరి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయో సత్యం న్యూస్ బయటపెట్టింది. ఈ సందర్భంగా ఆ వార్తా సంస్థలకు చెందిన ఒక రిపోర్టర్ నువ్వు మధ్యలో ఉండి అంతా విని రాసినట్టు ఉందే అని ఎద్దేవా చేశాడు. అప్పుడు సత్యం న్యూస్ రాసిందే ఇప్పుడు జరుగుతున్నది. ఏపి మ్యాగజైన్ ఎడిటర్ గా ఉన్న వ్యక్తిని వెళ్లగొట్టారని రాస్తే అతను అత్యం నీచమైన పదజాలంతో సత్యం న్యూస్ పై ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టాడు. చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా వార్త వచ్చిన ప్రతి సారీ బెదిరింపులు వచ్చాయి. జగన్ డబ్బులు ఇచ్చి ఈ వెబ్ సైట్ పెట్టించాడని పుకార్లు లేపారు. నేను ఒక్కడినే కాదు ఈ సైట్ నడుపుతున్నది. నా వెనుక అత్యంత అనుభవం ఉన్న జర్నలిస్టులు ఉన్నారు. వారిచ్చే ఇన్ పుట్ సత్యం న్యూస్ కు పెట్టుబడి. వారిచ్చే సమాచారం సత్యం న్యూస్ కు జీవనాధారం. ఇన్ని మెదళ్ల కదలిక కాబట్టే సమాచార రంగంలో ఇంతటి సంచలనం కలిగింది.
బెదిరింపులకు అదరలేదు
టివి9 వాటాదారుల విభేదాల విషయంలో సత్యం న్యూస్ వెలువరించిన కథనాలు, పాఠకులకు నిష్పక్షికంగా అందించిన వార్తలు సంచలనం కలిగించాయి. అత్యంత పెద్ద మీడియా పెద్దలతో ఎందుకు తగాదా పెట్టుకుంటావు అని కొందరు నన్ను హెచ్చరించారు కూడా. ఎన్నో విజయాలు సాధిస్తుండగా ఒక్క సారిగా సత్యం న్యూస్ కు బ్రేక్ పడింది. సాంకేతికంగా అన్ని విషయాలూ అందరికి తెలియవు. అందుకే కొందరిపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే సత్యం న్యూస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎవరో సైట్ ను హ్యాక్ చేశారు. డేటా మొత్తం కరప్టు చేశారు. బ్యాకప్ తీసుకోవడంలో నిర్లక్ష్యం జరిగింది. ఎవరి మీదకో తప్పు నెట్టేయడం నా ఉద్దేశ్యం కాదు. కానీ సత్యం న్యూస్ సాధించిన విజయాలన్నీ మరుగున పడిపోయాయి. ఇప్పుడు దానికి సంబంధించిన డేటా కూడా లేకపోవడం ఒక రకంగా బాధ కలిగించే విషయమే.
హ్యాకర్లు భవిష్యత్తును హ్యాక్ చేయలేరు కదా?
అయితే రాబోయే రోజుల్లో సత్యం న్యూస్ సాధించ బోయే విజయాలను మాత్రం ఆ హ్యాకర్లు అడ్డుకోలేరు కదా? అందుకే కొత్త వెబ్ సైట్ ఫార్మేట్ తో మళ్లీ మీ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే శత్రు దుర్భేద్యమైన సైట్ నిర్మించే స్తోమతు చిన్న కంపెనీలకు ఉండదు. వాట్స్ ప్, ఫేస్ బుక్ లే ఈ మధ్య కాలంలో విరామం తెచ్చుకున్నాయి మనమెంత. అందుకే వీలైన అన్ని జాగ్రత్తలతో మీ ముందుకు వస్తున్నాం మళ్లీ. సత్యం న్యూస్ అందించే వార్తలను చదవండి. మీకు ఆ వార్తలు, విశ్లేషణలు నచ్చితే వాటి లింక్ ను మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. కొందరు కేవలం మ్యాటర్ కాపీ చేసి పంపుకుంటున్నారు. ఇది తప్పు. కేవలం లింక్ ను మాత్రమే షేర్ చేయాలి. మరి కొన్ని సామాజిక మాధ్యమాలు నిస్సిగ్గుగా మా వార్తల్ని కాపీ కొడుతున్నాయి. పైనా కింది మార్చి రాసుకుంటున్నాయి. వాటి స్టోరీలుగా ప్రచారం చేసుకుంటున్నాయి. వారు రాసే వార్తల్లో ఏదో ఒక మూల సత్యం న్యూస్ సౌజన్యంతో అని పెట్టుకుంటే జర్నలిజం విలువలు పాటించినట్లు అవుతుంది.