నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ప్రతిపాదించారని ఆగస్టు 27వ తేదీన సత్యం న్యూస్ పోస్టు చేసింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దీనికి అనుకూలంగానే స్పందించబోతున్నారని కూడా సత్యం న్యూస్ అదే రిపోర్టులో స్పష్టం చేసింది. ఇప్పుడు అధికారికంగా ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహణపై వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సోవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోను, అలాగే అన్ని జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రం నుండి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారిని, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కృషి చేసిన వారిని సత్కరించే రీతిలో ఈ వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిఎస్ చెప్పారు. అందుకు అనుగుణంగా అవసరమైన కార్యక్రమాన్ని రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్యోద్యమం, రాష్ట్ర అవతరణకు కృషి చేసిన ప్రముఖులు వారి కుటుంబ సభ్యులను సన్మానించే విధంగా కార్యక్రమాలు రూపొందించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
previous post