24.7 C
Hyderabad
March 29, 2024 05: 50 AM
ప్రత్యేకం

ఆశావహ దృక్పథంతోనే ముందుకు సాగుతున్న భారతం

#Independenceday 1

ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశం భారత్ 74 వ స్వాతంత్ర్యవ వేడుకల్ని జరుపుకుంటోంది. ప్రతీఏటా

అత్యంత వైభవంగా నిర్వహించుకునే జెండా పండుగ ఈ సారి కరోనా నేపథ్యంలో పరిధులు, పరిమితులకు లోబడి జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఏడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశం బహుముఖాభివృద్ది సాధించింది. శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్యం తదితర రంగాలలో ప్రతిభ ప్రదర్శించి విశ్వవేదికపై సగౌరవ స్థానం పొందింది. ప్రధాని నరేంద్రమోదీ ఒక సందర్భంలో అన్నట్లు…. భారత్ స్వతంత్రదేశంగా అవతరించిన నాటినుంచి దేశాన్ని ముందుండి నడిపించిన ప్రధానమంత్రులందరూ తమదైన శైలిలో దేశప్రగతి లక్ష్యంగా శ్రమించినవారే అన్నది అక్షర సత్యం.

స్వేచ్చాయుత ప్రజాస్వామ్యం మనబలం

తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలు ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ వరకు అందరూ భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను పరిరక్షిస్తున్న వారే. గత డెబ్భై సంవత్సరాల పై చిలుకు స్వతంత్ర భారత చరిత్రను గమనిస్తే కొన్ని అపూర్వ విజయాలు, చారిత్రక ఘట్టాలు కనిపిస్తాయి. స్వేచ్చాయుత ప్రజాస్వామ్యం మనబలం.

లౌకిక భావన మన గుణం. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత. రాజ్యాంగ స్ఫూర్తి మన ఆయువు. జనాభా, ఆకలి , అవిద్య, నిరుద్యోగిత, పేదరికం వంటి అనేక అంశాల విషయంలో భారతదేశం ప్రపంచదేశాలకు దీటుగానే నిలబడుతోంది. మన దేశ ఘనసంస్కృతి, సాంప్రదాయాలు , సమున్నత లక్ష్యాలు మిగిలిన దేశాలలో కనిపించని విశిష్టతలు. నాలుగు వేదాలు పుట్టిన ధన్యభూమి, గీతామృతం పంచిన కర్మభూమి మనది.

కరోనా కూడా మన వ్యవస్థను కదిలించలేదు

కరోనా ఉద్ధృతికి యావత్ ప్రపంచం వణుకుతున్న వేళ భారత్ తనను తాను రక్షించుకుంటూ అమెరికా వంటి అగ్రదేశానికి సైతం అవసరమైన మందులు అందించి మానవతను చాటుకుంది. స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక ఫలితాపైనే ఆసక్తి ఉన్న భారత్ ఆశావాహ దృక్పథం ఇతరదేశాలకు ఆదర్శం అని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఇతర దేశాలతో భారత్ కు ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, దౌత్యపర ప్రాధాన్యతలు ప్రబల ఉదాహరణలుగా వారు తెలిపారు. తాజాగా భారత దేశంలో ఒకే దేశం, ఒకేజాతి, ఒకే విశ్వాసం వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. మోదీ ప్రభుత్వం హిందూ భావజాల ప్రాచుర్యానికి పాల్పడుతోందని కొన్ని రాజకీయ శక్తులు నిందారోపణ చేస్తున్నాయి.

ఒకే మతానికి సంబంధించిన దేశం కాదు

సమ్మిళిత ప్రజాస్వామ్య వ్యవస్థలో హిందుస్థాన్ అంటే ఒకమతా నికి చెందినదని భావించడం తప్పు. 1909 లోనే మహాత్మాగాంధీ హింద్ స్వరాజ్, హిందుస్థాన్ పదాలను తన హింద్ స్వరాజ్ అనే పుస్తకంలో ఉపయోగించారు. ఆ పుస్తకం నాలుగో అధ్యాయం లో ” మీ చిత్రీకరణ చెబుతున్నది – మాకు ఆంగ్లేయులు వద్దు కానీ ఆంగ్లేయుల పాలన కావాలి.పులి వద్దు కానీ పులి మనస్తత్వం కావాలి…. అంటే మీరు భారతదేశాన్ని ఆంగ్లభాషామయం చేస్తారు.

ఇంగ్లీష్ ఆవరిస్తే హిందుస్థాన్ అని దేశాన్ని ఎలా అనగలం ” అని సూటిగా సంధించారు. నేను అభిలషిస్తున్న స్వరాజ్ ఇది కాదని బాపూ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. గ్రామీణ భారతం వికసించాలని, గ్రామాభ్యుదయమే జాతికి జీవగర్ర అని ఆయన తరచూ అంటుండేవారు.

గాంధీ వారసునిగా నెహ్రూ అధికార పీఠం స్వీకరించినప్పటికీ గాంధీజీ ప్రవచించిన ‘హింద్ స్వరాజ్’ పట్ల ఆసక్తి కనపరచలేదు. మిగిలిన జాతీయనాయకులు సైతం మద్దతు ఇవ్వకపోవడం ఆశ్చర్యం. చరిత్ర అనేక సత్యాలను తనలో నిక్షిప్తం చేసుకుంది.

భారత్ విషయానికి వస్తే గాంధీ మార్గదర్శనం చేసిన  హింద్ స్వరాజ్ భావన పాదు కోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం…కరోనాతో కుదేలవుతున్న అన్ని రంగాలు తిరిగి పుంజుకోవడానికి ఎంత కాలం పడుతుందో అనూహ్యం. ఇటువంటి క్లిష్టదశలో భారత్ ప్రగతిశీల దృష్టితో ముందడుగు వేసి గ్రామీణ వ్యవస్థను, వ్యవసాయనుబంధ అంశాలను బలోపేతం చేయాలని ఆర్ధికరంగ నిపుణులు సూచిస్తున్నారు.

సంక్షోభం నుంచి మనం బయటపడాలి

70 శాతం పైగా భారత ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వ పరంగా ఉద్దీపన ప్రోత్సాహకాలు అందిస్తే పరిస్థితులు శీఘ్రంగా మెరుగుపడగలవు.

ఇటీవలి సంక్షోభం కారణంగా తలెత్తిన వలస కార్మికుల కడగండ్లు రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలని ప్రజాస్వామ్యాభిలాషులు సూచిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రతి భారతీయుడు స్వీకరించి, సామాజిక స్పృహతో వ్యవహరిచడం మనందరి కర్తవ్యం. ” బోలో స్వతంత్ర భారత్ కీ జై”

పొలమరశెట్టి కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

వై ఎస్ జగన్ అనర్హత పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

Satyam NEWS

మెగాస్టార్ ఆశీర్వాదాలు తీసుకున్న సోము వీర్రాజు

Satyam NEWS

శని, ఆది, సోమ…. మారిన ఉద్యోగ సంఘాల నేత మాటలు

Satyam NEWS

Leave a Comment