ఎవరు నీ కరుణ పాత్రులో, ఎవరు నీ పాదాక్రాంతులో!
ధర్మనిరతుల పాలిట కల్పతరువువట!
ఈ క్రౌర్యమానవులవిధ్వంసాలనుత్రుంచ
కోప శాపోద్రిక్తవై రా !
సమరకాళికవైరా!,సమసద్వివేకదేవికవైరా ! ।।2।।
సహజ సిద్ధాలు మానవ దుఃఖాలు ,
అసహజాలు నిర్మిత దుఃఖాలు.
ఒక్కగాటన కట్టలేమని చెప్పలేని నిస్సహాయ జనారణ్యంలో
ఎవరికివారు ఒంటరులైరి! త్రిగుణాత్మక త్రిశూలధారివై రా! ।। సమర।।
జీవనవేదం, జీవనవాదం శబ్దసౌకర్యపు
అభివ్యక్తి .
గమనంలేని పాదచారుల గరీబు బ్రతుకులొకవైపు,
నియమంలేని దానవబుద్ధుల గలీజు నడకలొకవైపు .
నీ సుందర హసితరూపు, నీ రౌద్ర ధిక్కారపు చూపు
స్వాంతననిచ్చే స్రోతస్వినివైరా..।।సమర
అబద్ధాలు, అహమహమికలు , అన్యాయాలు
మా ‘నవ’ బుద్ధుల్ని ఆక్రమించిన ముప్పేటలు .
నూరూరుల, కోట్ల క్రోసుల నేర జీవితమే
నేటిజీవనమయ్యె !
ఇదేమి యాదృచ్ఛికం కాదమ్మా!
క్షంతవ్యులం తల్లీ!
ఈ కృతఘ్న , కృతక సమాజాన్ని సంహరించగరా ..।। సమర।।
సమభావనలకు ప్రగతిశీల ప్రణవానివై ప్రతిధ్వనించు.
అపచారాలను తునుమాడ .. అమర శంఖారావాన్ని మ్రోగించ సింహవాహినివై ..
ఏటేటా లోకవారధివై ..
ఆషాఢ,శ్రావణబోనాలపండుగవైరా.. ।। సమర।।
డా।। కొండపల్లి నీహారిణి