28.7 C
Hyderabad
April 20, 2024 05: 36 AM
కవి ప్రపంచం

నీవు ఎవరు?

#PVS Krishnakumari

నిరాడంబరత్వం నిను చూసి

అనుకుంది..

‘ఓహో నేను ఇలా ఉంటానా !’అని

నిగర్వం ,నిస్వార్థం  నెచ్చెలులై

నీ అడుగు జాడల్లో నడిచాయి

పట్టుదల నీ శిష్యరికం చేసి

పాఠాలు నేర్చుకుంది

అనిర్వచనీయమైన నీ ఆత్మస్థైర్యం

జీవిత భాగస్వామిలా

కడవరకు నీ వెంటే ఉంది

రాజకీయ సంక్షోభంతో

కుంటుతున్న వ్యవస్థకు

విప్లవాత్మక సంస్కరణల

శస్త్రచికిత్స చేసి థన్వంతరివైనావు

ఆర్థికంగా చితికిపోయి

చిరిగిన చీరకట్టి దుఃఖితయైన

నీ తల్లి భారతావనికి

నూతన ఆర్థిక విధానమనే

పట్టుచీరను కట్టబెట్టి

సగర్వంగా తలెత్తుకొనేలా చేసి

ప్రియ పుత్రుడవైనావు

నిను మోహించిన భాషలు

పుష్పమాలికలై

నీ కంఠాన్ని అలంకరించి

మురిసిపోయాయి

ఇన్నేలా…..

నీ గురించి చెప్పటమంటే

చంద్రునికి వెన్నెల గురించి

చెప్పటం వంటిదే

ఇంతకీ నీవెవరు?

‘పీ.వీ.’ అని ముద్దుగా పిలుచుకునే

తెలుగుజాతి మేలిమి వజ్రానివి

‘పాములపర్తి వేంకట నారసింహుడివి’

-పీ.వి.యస్. కృష్ణ కుమారి

Related posts

చిరుకాంక్ష

Satyam NEWS

స్నేహ సౌరభం!

Satyam NEWS

అపర చాణుక్యుడు పీవీ

Satyam NEWS

Leave a Comment