32.7 C
Hyderabad
March 29, 2024 11: 29 AM
Slider కవి ప్రపంచం

తొందరపడి ముందే కురిసింది

#Jwalitha Balajeenagar

నీలాకాశం నీళ్ళోసుకుంది

పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతోంది

గాలి మంత్రసానిగ మారి

ఉఫ్ ఉఫ్ అంటూ బాధను ఊదేస్తోంది

నెత్తురోడే నాగటి చాళ్ళు

వలస గింజల కోసం

ఎదురు చూస్తూన్నాయి

వలపటి దాపటి ఎడ్ల నడుమ నడుస్తున్న రైతు

పొలం గట్టున వేపచెట్టుకు

ఉరి ఊయలూగుతున్నాడు

కొత్త ప్రాజెక్టుల నీళ్ళు గండిపడి

కొండపోచమ్మను తడిపి ముంచెత్తినయి

కరోనా కత్తెరతో కాస్ట్రేషన్ కొనసాగిస్తూన్నది

తొలకరి వాన తొందరపడి ముందే కురిసింది

పంటకల్లంలో ఎండిన మిర్చి తడిచి

రైతును మరోసారి ముంచింది

రాజ్యం చెప్పిన పంటకే మద్దతు ధర అంటే

నేలసారం తెలిసిన సేద్యగాడు

నేలకు అపరిచితుడయ్యాడు

నా తల్లి అన్నపూర్ణ

నేడు “ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియా” అయ్యింది

హాలికుడు ఎపటివలెనే సేవకుడయి

రైతే రాజంటూ స్వంత పొలంలో కాందిశీకుడై

క్వారంటైన్ చేయబడ్డాడు

పచ్చని ఆకాశం పంటపొలాలను కలగంటోంది

పుడమి తల్లి పురుడు లేకనే నెత్తురోడుతోంది

ఎకరాకు రెండువేల రొక్కం

గుడుంబా బట్టీకి నైవేద్యం అయింది

భూమి విత్తనాల కోసం కలవరిస్తోంది

నింగి వంగి శృంగారగీతమాలపిస్తోంది

సంక్షేమ పధకాల లబ్దితో

మనిషి మత్తులో జోగతున్నాడు

చేతిగీతలరిగిన ముసలితల్లి ఫించన్

చేతివాటం కార్యకర్త ఖాతాలో చేరింది

సేంద్రియ ఎరువుల కోసం

శవాల కుప్పలు కుళ్ళుతున్నాయి

ఉద్యమాల సాధికారత

ఉత్తుత్తి మిడతల దండు మెక్కుతోంది

తొందరపడి తొలకరి ముందే కురిసింది

ఏరువాక ఎత్తుగడలు తెలవక

కన్నీటిగుంట నిండి పోయింది.

తొందరపడి తొలకరి ముందే కురిసింది.

జ్వలిత   హైదరాబాద్

Related posts

మంత్రి కొడాలి నానికి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరిక

Satyam NEWS

ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నూతన కలెక్టర్లు సమర్థవంతంగా నిర్వర్తించాలి

Satyam NEWS

పోలీసులా లేక గులాబీ పార్టీకి ఏజెంట్లా?

Satyam NEWS

Leave a Comment