37.2 C
Hyderabad
March 29, 2024 17: 36 PM
కవి ప్రపంచం

తోరణం

#Aruna Naradabhatla PV

ఔను ఇప్పుడతడు అడుగడుగునా కనబడుతున్నాడు

తోరణాలు తోరణాలుగా వేలాడుతున్న తన ప్రతిభ

వీధి వీధిలో గల్లీ గల్లీలో

అందుబాటులోని లగ్జరీ వస్తువైంది అతని సమానత్వం స్వావలంబన!

మూరెడో బారెడో ఉన్న ఖరీదైన జీవితాన్ని

సాషేల్లోకి వంపి

పూరి గుడిసెలలోని ఆశలపై

అత్తరు చల్లినప్పుడే

అతడు ఆకాశానికి విస్తరించాడు

రెక్కల గుర్రాలను సగటు మనిషి ఇంటి గోడల్లో కట్టేసి

తమకూ ఓ లెక్కకందుతుందని చెప్పినప్పుడే

అతడు దిక్కులు తెంచిన వాణిజ్యమైపోయాడు

ఆకాశంలో నిలబడిన ఇంద్రధనుసులను వంచి

పెరటి మొక్కలను చేసిందీ అతడే!

మేధస్సును స్వేచ్ఛా విహంగాన్ని చేసి

ఇంటింటినో పరిశ్రమను చేసిన

అతని విశాల ఆశయం

నా ఆలోచనల భుజాలకూ రెక్కలిచ్చింది

నన్ను విశ్వసంచారిని చేసింది

నాకిప్పుడు హద్దులు లేవు

నా కోర్కొలకు కళ్ళాలూ లేవు

నేనిప్పుడు సిలికాన్ ప్రపంచపు ఏలియన్ ను

సూర్య,చంద్ర గ్రహమండలాల వాణిజ్య పంటను!

అతడు తెరిచిన తలుపులు

విశ్వద్వారాలు

అతని గెలుపు మా ఊరి పురిటిమంచపు ఫలం

అతని ప్రజ్ఞ

భరతజాతి

విజ్ఞాన కేతనం

అతని ఔన్నత్యం మౌనం

అతని జీవితం మార్గదర్శక గమనం!!

అరుణ నారదభట్ల

Related posts

తలుపు తట్టింది

Satyam NEWS

నువ్వంతే…….

Satyam NEWS

మౌనప్రవాహపు మౌనంలో…!!!

Satyam NEWS

Leave a Comment