24.7 C
Hyderabad
March 29, 2024 05: 55 AM
Slider కవి ప్రపంచం

మా పల్లె సంక్రాంతి

#Sujata P V L

ప్రతి ముంగిట రంగురంగుల రంగవల్లికలతో ఆహ్వానం పలుకుతోంది మా పల్లె సంక్రాంతి!

కళ్లాపి వాకిళ్ళు

ముచ్చటైన ముగ్గులు

ముగ్గుల నడుమ గొబ్బిళ్లు

గొబ్బిళ్ళపై కొలువుదీరిన బంతి,చేమంతి పూలు..రేగుపళ్ళు..చెరుకుగడ ముక్కలు,

గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు..

పచ్చటి పైరులు

పసిడికాంతులతో ఆహ్వానం పలుకుతోంది మా పల్లె సంక్రాంతి!

పడతుల కాలి అందెల చిరుమువ్వల సవ్వడితో

పక్షుల కుహు కుహు కూజితాలతో

పట్టు పరికిణీ పావడాలతో పెళ్ళికూతురిలా ముస్తాబై ప్రకృతి లక్ష్మికి

స్వాగతం పలుకుతోంది మా పల్లె సంక్రాంతి!

డూ డూ బసవన్నలు సందళ్ళు

గంగిరెద్దుల డప్పుచప్పుళ్ళు హరిదాసు కీర్తనలు

మంగళ వాయిద్యాలతో నవ్యకాంతులకు స్వాగతాంజలి పడుతోంది శుభ సంక్రాంతి!

చుట్టం వస్తే ఒక్కపూటకే ముఖం చూసుకొనే పట్నం సంస్కృతి మా పల్లెకి లేదు

పండగ పూటైనా..నలుగుపిండితో స్నానమాడి..కొత్తబట్టలేసుకొని గుడికెళ్ళొచ్చే సమయం లేదన్నమాట మానోట రాదెప్పుడు..

గడ్డకట్టే చలిలో తెల్లారుజామున నిద్రలేచి

అహాన్ని అగ్నికి ఆహుతిచేస్తూ

భోగిమంటల చుట్టూచేరి ముచ్చటించుకోవడమే మాకు తెలుసు..

కొత్త ధాన్యంతో చేసే అరిసెలు, గరుజులు, చక్రాలు, పూతరేకుల రకరకాల నేతి పిండివంటలు సమిష్టిగా ఆరగిస్తూ..

ఆరుబయట కూర్చొని అందరితో కలిసి అనుభూతుల్ని కలబోసుకోవడమే మా మంచి మనుషులకు తెలుసని సమైక్యతను చాటుతోంది మా పల్లె సంక్రాంతి!..

మనసుని పక్షిలా చేసి పిల్లలతో సమంగా గాలిపటాలెగరేస్తూ..ఎగిరిగంతులేసేంత పసితనం ప్రతి ఒక్కరి సొంతమంటోంది మా పల్లె సంక్రాంతి!

అందుకే రండి!!

మీ గజిబిజి జీవనానికి చెక్ పెట్టి

డైటింగ్ రోగాలను పక్కకు నెట్టి

మర మనిషిలా మనీ వేట బతుకునుండి బయటికొచ్చి మా పల్లెకు ప్రయాణమవ్వండి!

పంచభూతాలను ప్రేమించండి!

ఆకాశంతో మంతనాలాడండీ!

కమ్మని దృశ్యాలను

కళ్ళతో క్లిక్ మనిపించి

హృదయపు ఆల్బమ్ పల్లె పండుగ ఫోల్డర్లో భద్రంగా పదిలపరచుకోండి.!.

జీవితకాల మధురోహల్ని మననం చేసుకొంటూ చిరాయువులుగా జీవించండి!!

సుజాత.పి.వి.ఎల్. సైనిక్ పురి, సికిందరాబాద్

Related posts

సో శాడ్: రాజధాని కోసం మరణించిన మరో ఇద్దరు

Satyam NEWS

పది రూపాయల మాస్క్ ధరించకపోతే వెయ్యి జరిమానా

Satyam NEWS

బండి సంజయ్ పై దాడి జరగలేదని పోలీసుల వివరణ

Satyam NEWS

Leave a Comment