35.2 C
Hyderabad
April 20, 2024 16: 07 PM
Slider కవి ప్రపంచం

రణం నా గుణం..

#ElisettiSureshkumar

నువ్వెంత జీవమే లేని ఓ కణం..

కరోనా..

నీకు తెలియదేమో మానవజీవితం మొత్తం పోరాటాలమయమని..

అసలు మనిషి ఉద్భవమే

ఓ సుదీర్ఘ పోరాటం

అందమైన ఈ ప్రకృతి

పరిపూర్ణమైన మానవ ఆకృతి

ఎన్నో సంవత్సరాల మథనం

సృష్టి ఆది నుంచి అంతే లేని

పరిణామక్రమం..

జయాపజయాల సమాగమం.!

మనిషి పుట్టాకే శాస్త్రం పుట్టింది

శోధన,సాధన..

మలుపు,గెలుపు..

అన్నీ మనిషితోనే మొదలు

ఆ బుర్రకి ఎప్పుడూ

పట్టలేదు చెదలు

నిజానికి మానవ మస్తిష్కమే

ఓ ప్రయోగశాల..కార్యశాల

అరమరల గ్రంధాలయం

అతడి దేహమే దేవాలయం..

ఈ జీవన గమనంలో

ఎన్నో పోరాటాలు

జంతువుతో,ప్రకృతితో,

తనలోని వికృతితో

సాటి మనిషితో..

కురుక్షేత్రాలు,ప్రపంచయుద్ధాలు

హిరోషిమా,నాగసాకీలు

దురాక్రమణలు,దౌర్జన్యాలు..

ప్రతి క్షణం ఓ రణం

నువ్వెంత జీవమే

లేని  కణం..

గతంలో తలపడ లేదా

నిన్ను మించిన

క్రిములతో,కీటకాలతో

మశూచిని సాగనంపలేదా

కలరాని తరిమి కొట్టలేదా..

డైనోసార్స్,మీ అక్క సార్స్

ఇలాంటి ఎన్నింటి

కొమ్ములు విరచలేదు

పీచమణచ లేదు..

పాములు,తేళ్లు

కక్కలేదా విషాలు..

చూడలేదా ఆ తమాషాలు..

అసలు మృత్యువుతోనే కదా

మనిషి పోరాటం

దినదిన గండం..అగ్నిగుండం..

ప్రతి మలుపులో ఓ గెలుపు..

ఎత్తుపల్లాల దారిలో నడక

ప్రతిరోజూ ధైర్యమే ఊపిరిగా

మరో పుట్టక..

కాలకూట విషాన్నే ఔషధంగా మలచిన మానవ మేధస్సు

ఎన్నో అపాయాలకు ఉపాయాలు కనిపెట్టిన

అతడి యశస్సు..

ఇప్పుడు నీ కొమ్ములు

విరిచేందుకు సాగుతున్న అతగాడి తపస్సు

తప్పక ఫలిస్తుందని చెబుతోంది

పదే పదే నా మనస్సు..

ఓ కరోనా..అసలు జీవే కాని నువ్వు చిరంజీవి

ఎలా అవుతావు..?

ఇహనో,ఇప్పుడో ఓ శుభవార్త..

అసలు నీ అంతానికి మానవుడే కర్త..

అందుకు నా భారతదేశమే

సమన్వయకర్త..

శ్రీశ్రీ కి అంకితం..

ఎలిశెట్టి సురేష్ కుమార్, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్

Related posts

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్ హామీ

Satyam NEWS

కాలాతీతుడు

Satyam NEWS

శ్రీశైలం గోశాల బాధ్యతల నుంచి రజాక్ భార్యకు ఉద్వాసన

Satyam NEWS

Leave a Comment