24.7 C
Hyderabad
March 29, 2024 07: 34 AM
Slider కవి ప్రపంచం

అలుపెరుగని బాటసారమ్మ!

#Purimalla Sunanda Khammam

తెచ్చిపెడితే వండి  వార్చి

గుట్టుగా సంసారం నడుపుకునే

మధ్య తరగతి  ఇల్లాలు కాదామే!

నోట్లతో అజమాయిషీ చేసి

నోరు తెరవకుండానే ఇంటిల్లిపాదికి

అన్నీ సమకూర్చే  ఉన్నమ్మ కాదు!

ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క

కన్న పేగుల కడుపాకలి తీర్చేందుకు

బతుకు దెరువు కోసం

ఎల్లలు దాటిన వలసమ్మ ఆమె!

ఒంట్లోని సత్తువను నరాల్లో ప్రవహించే

ఓపిక రక్తాన్ని పీల్చి పైసలుగా మార్చి ఇచ్చే

పొలాల్లో, భవనాలలో, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో

పనులు దొరకే తావుల్లో

వంచిన నడుమెత్తకుండా పనిచేసే

శ్రామికమ్మ!

నెలలో మూడురోజుల బాధను

మునిపంటితో నొక్కి పట్టి

స్రవిస్తున్న రుధిరాన్ని 

బిడియపు  చీరముక్కలతో భరిస్తూ

కష్టాలను కడుపులో దాచుకుని

అంకిత భావంతో పనిచేసే పనమ్మ!

కాలం తిరగబడి

కరోనా మహమ్మారై  వెంటాడుతుంటే

కరువైన ఉపాధి

నిలువ నీడ  లేకుండా వలస పక్షిని చేసి

భవిష్యత్తు రెక్కలు విరిచేస్తే

తల్లకిందులైన బతుకు నావను

ఒడ్డుకెలా చేర్చాలో తెలియక

తీగకు కాయ యెప్పటికీ భారం కాదని

ఋజువు చేసిన మాతృ మూర్తమ్మ!

కాయ కష్టం చేసిన భుజాలపై

రేపటి తరమైన కన్న బిడ్డలను

కట్టు బట్టల సంచిని సవ్యసాచై మోస్తూ

ఓడిపోని ధృడ సంకల్పంతో

చేతిలో  ఇం’త’ ధనం లేక పోయినా

పాదాలను వాహనంగా మార్చుకుని

పల్లె బాట పట్టిన కూలమ్మ!

లాక్ డౌన్ భయపెట్టినా

తనకెవరూ ఆపన్నహస్తం అందివ్వక పోయినా

కష్టాల కడలిని సడలని ధైర్యంతో

ఈదుతూ

ఎండా వానలను లెక్క చేయకుండా

ఉన్న ఊరు అయిన వాళ్ళ తీరం

చేరేందుకు సాగిపోతున్న అమ్మ

అలుపెరుగని బాటసారమ్మ!

వురిమళ్ల సునంద, ఖమ్మం

Related posts

అన్యాయంపై గళమెత్తితే గొంతు నొక్కుతున్నారు

Satyam NEWS

నాలా పనుల్లో జాప్యంతో ప్రజల జీవితాలతో చెలగాటమా..?

Satyam NEWS

విశాఖ స్టీల్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం

Satyam NEWS

2 comments

యడవల్లి శైలజ కవయిత్రి ఖమ్మం May 22, 2020 at 7:00 PM

Nice program sir

Reply
Satyam NEWS May 23, 2020 at 12:23 AM

Thank You

Reply

Leave a Comment