ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలే వార్త ఇది. సత్యం న్యూస్ జనవరి 9నే ఈ విషయాన్ని వెల్లడించింది. సత్యం న్యూస్ చెప్పినప్పుడు నిజమా? ఇలా జరుగుతున్నదా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సత్యం న్యూస్ కావాలని ఇలా రాస్తున్నదని మరి కొందరు శాపనార్ధాలు పెట్టారు.
అయితే అదే నిజమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ దీర్ఘకాలిక సెలవులో వెళ్లబోతున్నారు. రాజధాని తరలింపుపై పీకల్లోతు వివాదాల్లో ఇరుక్కుపోయి ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ అకస్మాత్తుగా వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం నిజంగా షాక్ లాంటిదే.
బహుశ రెండు మూడు రోజుల్లో నీలం సాహ్నీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవచ్చు. వాస్తవానికి నీలం సాహ్నీ జూన్ నెలలో పదవీ విరమణ చేస్తారు. రిటైర్ అయ్యేలోపు చీఫ్ సెక్రటరీ పదవి చేయాలని అందరు ఐఏఎస్ లు భావిస్తారు. ఎల్ వి సుబ్రహ్మణ్యంను అవమానకరంగా పంపిన తర్వాత ఖాళీ అయిన ఆ స్థానంలోకి అప్పటి వరకూ కేంద్ర సర్వీసులో ఉన్న నీలం వచ్చారు.
వచ్చిన రోజు నుంచి వాస్తవ పరిస్థితి అర్ధం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. చీఫ్ సెక్రటరీగా ఉండి ఒక పిఏలాగా పని చేయాలనే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉందని అనతి కాలంలోనే అర్ధం అయింది. సిఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు రావడం తప్ప మంచి చెడు చర్చించే పరిస్థితి లేకపోవడం నీలం సాహ్నీకి మింగుడు పడలేదు. దాంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. ఇదే విషయాన్ని సత్యం న్యూస్ అందరికన్నా ముందుగా బయటపెట్టింది. (బహుశ సత్యం న్యూస్ రాసే సమయానికి వేరెవరూ రాయలేదు) రిటైర్ మెంట్ అయ్యే వరకూ ఓపిక పడదామని చూసినా అందుకు వీలు కావడం లేదని సమాచారం. రోజువారీగా జరుగుతున్న పరిణామాలు బాధ్యత గల వ్యక్తులకు కంపరం పుట్టిస్తున్నాయని అంటున్నారు. పర్యవసానంగా నీలం సాహ్నీ సెలవులో వెళుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.