20.7 C
Hyderabad
February 5, 2023 04: 30 AM
Slider సినిమా

ఆకట్టుకునే కథనంతో సాగిన లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ “నేనెవరు”

#nenevaru

క్రైం థ్రిల్లర్ లను ఇష్టపడే సినీ ప్రేమికుల కోసం నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నేనెవరు”. ఈ చిత్రం నేడు (డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై  భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ఇందులో కోలా బాలకృష్ణ హీరోగా నటించారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో  ప్రేక్షకుల మందుకు వచ్చిన “నేనెవరు” ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథాకథనం విషయానికి వస్తే క్రిష్ (కోలా బాలకృష్ణ), చిత్ర (గీత్ షా) ఇద్దరు ప్రేమించుకుంటారు. ఒక చిన్న విషయంలో గొడవ పడి బ్రేకప్ అవుతారు. ప్రియురాలు దూరం కావడంతో క్రిష్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. చిత్ర లేని జీవితం క్రిష్ కు పెను భారంగా మారుతుంది. అదే సమయంలో తన కుటుంబంలోని ఇతర సభ్యులు వరుసగా హత్యలకు గురవుతారు. క్రిష్ మేనత్త, మేనత్త కూతురు (తనిష్క్ రాజన్), జీకే (బాహుబలి ప్రభాకర్), మేనత్త అనుచరుడు నాయుడు వరుసగా హత్యలకు గురయిన వారిలో ఉంటారు. మరోవైపు క్రిష్ మాత్రం తన ప్రేయసిని తలచుకుంటూ తాగుడుకు బానిసై పోతాడు. అందరితో గొడవ పడుతూ… కనిపించిన వారికి అంతా తన లవ్ స్టోరీ చెబుతూ తిరుగుతుంటాడు. ప్రేమ కథగా ప్రారంభమైన చిత్రం క్రైం థ్రిల్లర్ గా మారుతుంది. ఈ వరుస హత్యలకు కారణం ఏమిటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చిత్ర మళ్లీ క్రిష్ జీవితంలోకి వస్తుందా? అనే ఆసక్తికరమైన అంశాలకు తెరరూపమే  “నేనెవరు” చిత్రం.

ఆసక్తికరంగా సాగిన కథ

చిత్రం తీసిన తీరును విశ్లేషించాల్సి వస్తే ఈ లవ్, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి ఎంతో ఆసక్తికరంగా మలిచాడని చెప్పవచ్చు. ప్రేమతో ముడిపడిన క్రైం థ్రిల్లర్ లను ఇష్టపడే సినీ ప్రేమికులు చాలా మంది వున్నారు. అందుకే అలాంటి కథలని ఎన్నికోణాల్లో ఆవిష్కరించినా కొత్తగానే ఉంటుంది. ప్రేక్షకుల్ని ఆలోచింప చేసే విధంగా “నేనెవరు” కథనం సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో హీరోని భగ్న ప్రేమికడిగా, తాగుబోతుగా చూపించి, ఆ తరువాత మర్డర్ మిస్టరీని ఛేదించిన విధానం ప్రేక్షకుల్ని థ్రిల్ కి గురి చేస్తుంది.

ఈ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఆద్యంతం ఉత్కంఠభరిత సన్నివేశాలతో కట్టిపడేసింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ క్రైం అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎన్నో చిత్రంలో కనిపిస్తాయి. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా కథనం సాగింది. దర్శకుడు రొటీన్ జోనర్స్ ని టచ్ చేయకుండా… ఓ డిఫరెంట్ జోనర్లో ఈ మూవీని తెరకెక్కించడంలో విజయం సాధించారు. హీరోగా నటించిన కోలా బాలకృష్ణ భగ్న ప్రేమకుడిగానూ, రివెంజ్ డ్రామా లో మాస్ ను మెప్పించే పాత్రలోనూ చక్కగా నటించాడు.

నటనతో ఆకట్టుకున్న పాత్రలు

అతని ప్రేయసి పాత్రలో గీత్ షా చక్కగా ఒదిగిపోయింది. హీరోను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే యువతిగానే కాకుండా కాస్త సైకోలా ప్రవర్తించే పాత్రలో ఆకట్టుకుంటుంది. అలాగే హీరో మరదలిగా తనిష్క్ రాజన్ మెప్పించింది. ఆమె అమ్మగా లేడి దాధాగా నటించిన నటి కూడా బాగా చేసింది. ఇక పోలీస్ ఆఫీసర్ గా నటించిన సాక్షి చౌదరి అదరగొట్టిందనే చెప్పాలి. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా చెలరేగి నటించింది. బాహుబలి ప్రభాకర్ జి.కె.పాత్రలో విలన్ గా, హీరో స్నేహితునిగా కమెడీయన్ సుదర్శన్  తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.

దర్శకుడు నిర్ణయ్ పల్నాటి ఎంతో అనుభవం ఉన్న రీతిలో చిత్రీకరించి తాను రాసుకున్న కథను రక్తి కట్టించారు. కథనాలు గ్రిప్పింగ్ గా, ఎంగేజింగ్ గా వున్నాయి. ఆర్.జి.సారథి అందించిన సంగీతం సన్నివేశాలను మరింత రక్తికట్టంచాయి. ఓ రెండు ట్యూన్స్ చాలా రోజులు మనలను వెంటాడతాయి. ముఖ్యంగా క్రైం థ్రిల్లర్స్ కి కావలసిన నేపథ్య సంగీతం బాగా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు క్వాలిటీగా వున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని నిర్మించారని పించింది. కోలా భాస్కర్ ఎడిటింగ్ ఈ చిత్రానికి పెద్ద బలం. కథ, కథనాల పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ… అవేవీ సినిమాను ఆస్వాదించడంలో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టవు.

సత్యంన్యూస్ రేటింగ్: 3.25/5

Related posts

హైదరాబాద్ లో క్రైస్త‌వ భ‌వ‌నం కోసం రెండు ఎక‌రాల స్థ‌లo

Murali Krishna

త్వరలో అందుబాటులోకి రానున్న టియస్ బిపాస్ విధానం

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన ఇస్మార్ట్ సావిత్రి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!