34.2 C
Hyderabad
April 19, 2024 22: 51 PM
Slider కవి ప్రపంచం

వ్యధాభరిత జీవనం

#Puli Jamuna

ఆకలి కేకలు అప్పుల బాధలతో

చేజారి పోతున్న చేతివృత్తులతో

కన్నతల్లిలాంటి పల్లె తల్లిని

ఆత్మీయబంధాలను వదిలి

రెక్కల కష్టాన్ని నమ్ముకున్న

వలస కూలీల బతుకు పోరాటం

బండలు పగులగొట్టి బరువులు మోస్తూ

ఫ్యాక్టరీలో కార్మికులుగా మారి

అందమైన భవనాలను నిర్మిస్తూ

పొట్టకూటికై పుట్టెడు పనులను చేస్తూ

బతుకు భారాన్ని మోసే వలసజీవులు

దేశ ప్రగతి సౌధానికి వీరే పునాదులు

ప్రపంచాన్ని కలవరపెడుతూ

కరోనా రూపంలో కాలం కన్నెర్ర చేసి

కనీవినీ ఎరుగని కష్టాలతో

జీవితాలకు చిక్కుముడి వేసింది

ఆనందాలను ఆవిరి చేస్తూ

బతుకులలో నిప్పులు పోసింది

లాక్ డౌన్ తో పనులు కోల్పోయి

ఇంట్లో పస్తులతో గడప లేక

నిప్పులు చెరిగే ఎండలో

నిబ్బరమే ఆయుధంగా చేసుకుని

కన్న ఊరికి కాలినడకన

నరక యాతననుభవిస్తూ

అలుపెరుగని పోరాటం చేస్తున్నారు

నిప్పుల గుండమైన ఎండలో

కందిపోయి బొబ్బలెక్కిన పాదాలు

రుధిర పాద ముద్రికలై

రహదారులను చిత్రిస్తున్నాయి

నెత్తిన భుజాలపై భరింపలేని బరువులతో

పిల్లాపాపలతో సాగే పయనం

ఆకలిమంటను మించిన ఎండవేడి

అలసిసొలసిన వలస దేహాలలోని

శక్తినంతా ఆవిరిని చేస్తుండగా

గాలిలో దీపాల్లా రెపరెపలాడుతున్నారు

వలస జీవుల బతుకు చిత్రాలు

కంట కన్నీరొలికించే సజీవదృశ్యాలు

ఎంతో కాలంగా ప్రోది చేసుకున్న

మమతానురాగాలను పెనవేసుకోవాలని

గుండెను గుప్పెట్లో పెట్టుకుని

సడలని మనోనిగ్రహంతో సాగిపోతున్నారు

గమ్యం చేరాలనే వారి ఆరాటానికి ఊతమై

ఆదుకునే దిక్కుమొక్కు లేని వారికి

ఆపన్న హస్తాలమై అండగా వుండి

పల్లెతల్లి ఒడిని పదిలంగా చేర్చుదాం

మానవత్వ దీపాలను వెలిగించి

వలస బతుకులలో వెలుగులు నింపుదాం

పులి జమున, మహబూబ్ నగర్

Related posts

ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ రూపకర్త సీఎం

Sub Editor

ఆర్ఆర్ఆర్ తో బాటు టీవీ5, ఏబీఎన్ పై కూడా పోలీసు కేసు

Satyam NEWS

రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్న వైసిసి

Satyam NEWS

Leave a Comment