38.2 C
Hyderabad
April 25, 2024 13: 47 PM
కవి ప్రపంచం

రూపవిక్రియ

#V.Padma

అస్సలు నిజం

అందంగా మలుచుకోటానికి,

అదో పెద్ద యుద్దమే చేస్తుంది.

ఒళ్ళంతా ముళ్ళతో కంపరం

కళ్ళు మూసి ధ్యానిస్తుందో….!

ఒళ్ళు మరిచి శ్రమిస్తుందో…!

ఒక్కసారి సప్తవర్ణాలు సంగమించినట్టు…

సంతరించుకున్న రూపం

సర్రున ఎగిరి రంగులద్దుతుంటే

సీతాకోకలతో చీర చుట్టిన

ప్రకృతి పరవశం పట్టవశమా….!

అదో విచిత్రం…. సృష్టి విరచితం.

వేషం వేసుకున్నంత

వీజీ.. కాదు,

విగ్రహం రూపుదిద్దాలంటే,

ఆణువణువూ అన్వేషించాలి…

అదేపనిగా నిమగ్నమవ్వాలి…!

తనను తాను మరిచిపోవాలి..!

తనలోని లోపాలని…కోపాలని

తనకంటిన పాపాలని…

తరచి తరచి తొలచాలి

నిలువెల్లా చీల్చుకుని

నిన్నటి నీడల్ని.. చీడల్ని

చెరిపి కొత్తగా..కొంగ్రొత్తగా…

చిగురించిన రెక్కలతో

రివ్వున ఎగిరితేనే…రూపవిక్రియ

నిన్నటి మరకలు తుడిచి,

చుట్టిన ముళ్ళను ఒలిచి,

రూపుదిద్దుకున్న రూపానికి

మంచిని అద్దుకుంది కనుకే

మకరందం గ్రోలుతుంది.

మధుర భావనలు మోస్తుంది…

ఓంకార నాదాలతో

మరో నూతన సృష్టికి

శ్రీకారం చుడుతుంది.

ఎన్నెన్నో ఊసులతో

చుట్టరికం కలుపుతుంది….

కల్మషాలు బాపుతుంది.

కమ్మని ఊసులతో……..

కనువిందు చేస్తుంది.

వి.పద్మ, హైదరాబాద్, 9951445867

Related posts

అవని..అమ్మ!

Satyam NEWS

బహుముఖ ప్రజ్ఞాశాలి

Satyam NEWS

ప్రధానమైన నూరు పాఠాలు

Satyam NEWS

Leave a Comment