శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(SVBC) అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు విశేష కృషి చేస్తున్న నవీన్ కుమార్ రెడ్డి ఇటీవల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
టీటీడీ లోని కొంత మంది ఉన్నతాధికారులు ఏపీ సీఎం పేరు చెప్పి పెత్తనం చెలాయిస్తున్న కారణంగా వాస్తవాలు బయటకు రావడం లేదని ఆయన అన్నారు. సంవత్సరానికి 20 కోట్ల బడ్జెట్ ఎస్వీబీసీ కి ఉంటుందని అయితే దీనిపై అజమాయిషీ మాత్రం ఎవరూ చేయడం లేదని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
టిటిడి అధికారులు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ ను ఒక రాజకీయ పోస్టుగా మాత్రమే చూస్తూ దాని జోలికి వెళ్లడం లేదని అన్నారు. దీనివల్ల ఛానెల్ లో అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. తక్షణమే ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చానల్ ప్రతిష్ట ఇప్పటికే దెబ్బ తిన్నదని, ఏపీ సీఎం ప్రభుత్వ నిఘా సంస్థల నుంచి టిటిడి లో జరుగుతున్న అక్రమాల సమాచారాన్ని తెప్పించుకొని అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.