బాల్య వివాహాలు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సావిత్రి బాయి పూలే… అట్టడుగు వర్గాలు, మహిళల విద్య కోసం చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయత్యోంత్సవం సందర్భంగా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రి భాయీ పూలే మహిళా, బాలికల విద్య కోసం ఎంతో కృషి చేశారన్నారు. దేశంలోనే మొట్టమొదటి బాలికా పాఠశాలను ఆమె నెలకొల్పారన్నారు.
విద్యతోనే మహిళలకు గౌరవం లభిస్తుందని నమ్మిన వ్యక్తి అని అన్నారు. మహిళల విద్య కోసం సావిత్రబాయి చేసిన సేవలను గుర్తిస్తూ…ఆమె జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. సామాజిక సంస్కర్తగా, రచయితగా స్త్రీల హక్కుల కోసం పోరాడిన ధీశాలని కొనియాడారు. చివరి క్షణం వరకూ నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం యోధురాలన్నారు. వితంతు వివాహాలు జరిపిన మహోన్నతురాలు సావిత్రభాయి పూలే అని, తన భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక సేవలో కొనసాగారని మంత్రి సవిత తెలిపారు. సావిత్రిభాయి పూలే పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆచరణీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, డైరెక్టర్లు శొంఠి శివరామప్రసాద్, శింగం వెంకన్న, వల్లూరి మధుసూదనరావు, టీడీపీ నాయకులు వేములకొండ శ్రీనివాసరావు, మరకా శ్రీనివాసయాదవ్, పేరేపి ఈశ్వరరావు, కత్తుల మణికంఠ, బడుగు తిరుపతిరావు, పిరియా సోమేశ్వరరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.