ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం జరగదు. రాజ్యాంగంలో ఎస్సీ ఉపకులాలను విడగొట్టాలని ఎక్కడా రాయలేదు అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం జరిగిపోయిందని నాయకులు సంకలు ఎగరేసుకుంటున్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలు తీర్పు ఇచ్చారు. అది ఆర్డర్ కాదు. డిజార్డర్. సుప్రీం కోర్టులో 33 మంది జడ్జీలు ఉంటే, అందులో 20 మంది బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జిల్లో వర్గీకరణ తేవాలి అని ఆయన అన్నారు.
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రెండు కులాలే 70 ఏళ్లు పరిపాలించారు. సామాజిక న్యాయం అంటే ఇదా? ఆ రెండు కులాలే అధికారాన్ని చెలాయించడం సామాజిక న్యాయమంటారా? అని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల దేశ సంపదలో వర్గీకరణ కావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు బ్యాంకుల రుణాల్లో 50% రుణాలు ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలు దేశ జనాభాలో 25% ఉన్నారు. కానీ బ్యాంకులు ఇస్తున్న అప్పుల్లో ఒక్క శాతం కంటే తక్కువగా ఇస్తున్నారు. మార్వాడీలకు, గుజరాతీలకు బ్యాంకులో అప్పులు ఇస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు బ్యాంకు రుణాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. గుజరాత్ కు చెందిన ఒకాయన 45 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని, అందులో ఒక్క శాతం కట్టి, మోడీ సహకారంతో 99 శాతం రుణమాఫీ చేయించుకున్నాడు అని చింతామోహన్ వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ పై మిశ్రా కమిషన్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను. వ్యతిరేకిస్తున్నాను. వెంటనే మిశ్రా కమిషన్ ను రద్దు చేయాలి అని ఆయన అన్నారు.