భారతదేశంలో స్వలింగ వివాహాలను గుర్తించడానికి నిరాకరిస్తూ 2023 అక్టోబర్ 17 నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఆ తీర్పులో ఎటువంటి లోపం స్పష్టంగా కనిపించనందున జోక్యం అవసరం లేదని పేర్కొంది. రెండు తీర్పులో వ్యక్తీకరించిన అభిప్రాయం చట్టానికి లోబడి ఉందని అందువల్ల ఎటువంటి జోక్యం అవసరం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు దాఖలైన రివ్యూ పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. బెంచ్‌లోని ఇతర నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ దీపాంకర్ దత్తా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో స్వలింగ వివాహాలను గుర్తించడానికి నిరాకరించిన మొదటి బెంచ్‌లో ఉన్న జస్టిస్ నరసింహ ఒక్కరే ఇంకా పదవిలో ఉన్నారు. ఆ బెంచ్‌లోని ఇతర నలుగురు న్యాయమూర్తులు సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ అందరూ పదవీ విరమణ చేశారు.
అప్పటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అక్టోబర్ 17, 2023న ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం స్వలింగ వివాహాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. వివాహం చేసుకునే ప్రాథమిక హక్కు లేదని పేర్కొంటూ, భారతదేశంలో స్వలింగ వివాహాలను అనుమతించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయినప్పటికీ వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఉన్నత పవర్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
రాజ్యాంగంలోని 19 మరియు 21 అధికరణలు LGBTQIA+ వ్యక్తులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకునే హక్కును కల్పిస్తున్నాయని అందువల్ల ప్రత్యేక వివాహ చట్టం అనేది LGBTQIA+ వ్యక్తుల గౌరవం, నిర్ణయాత్మక స్వయంప్రతిపత్తి హక్కును ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు వాదించారు. కాబట్టి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన జీవించే హక్కు మరియు స్వేచ్ఛను ఉల్లంఘించినట్లు అవుతుందని కూడా న్యాయస్థానానికి విన్నవించారు. అయినప్పటికీ,ఈ కోర్టు ప్రత్యేక వివాహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును కొట్టివేయదు లేదా దాని సంస్థాగత పరిమితుల కారణంగా ప్రత్యేక వివాహ చట్టం లోని పదాలను తీసివేయదు అని స్పష్టం చేశారు.