39.2 C
Hyderabad
April 25, 2024 16: 08 PM
Slider ముఖ్యంశాలు

సైన్స్ డే: భారత శాస్త్ర విజ్ఞానంపై ఇప్పటికీ రామన్ ఎఫెక్ట్

CVRaman

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

నేడు జాతీయ సైన్స్ దినోత్సవం. వాస్తవానికి మన దేశంలో ప్రతి ఒక్కరూ గర్వంగా జరుపుకోవాల్సిన ఉత్సవం ఇది. విశ్వవిఖ్యాత సైంటిస్టు, భారతరత్న డాక్టర్‌ సి.వి. రామన్‌ అనన్య సామాన్య పరిశోధనా సామర్ధ్యంతో ఫిజిక్స్‌ రంగంలో ”రామన్‌ ఎఫెక్ట్‌” కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28నే జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.

విజ్ఞాన ఆవిష్కరణల్లో భారతీయులకు నోబుల్ బహుమతి రావడం అంత సులభమేం కాదు. అలాంటిది సర్ సీవి రామన్ అ ఘనత సాధించిపెట్టారు. అదీ ఆసియా ఖండం చరిత్రలోనే విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి రామన్. అంతకుముందు 1913లో సాహిత్యంలో మనదేశం నుండి నోబెల్‌ బహుమతి పొందిన విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అనంతరం సైన్సు రంగంలో అంతటి ఘనకీర్తిని సాధించిన వ్యక్తి రామన్‌ కావడం అందరికీ గర్వకారణం.

మన దేశంలో పుట్టి, మన దేశంలోనే చదువుకొని, మన దేశం లోనే పరిశోధన చేసి, తన అత్యంత విశిష్ట కృషికి గుర్తింపుగా ఫిజిక్స్‌లో మొట్ట మొదటి సారిగా నోబెల్‌ బహుమతిని పొంది చరిత్ర సృష్టించిన మహనీయుడు రామన్‌. నోబెల్‌ బహుమతి పొందిన మొట్టమొదటి శ్వేతేతర శాస్త్రజ్ఞుడు రామన్‌ కావడం గర్వకారణం.

అంత వరకూ సైన్సులో నోబెల్‌ బహుమతులు అన్నీ శ్వేతజాతీయులకే దక్కాయి. భారతీయునిగా ఈ గడ్డపై, ఇక్కడ చదువుకొని భారతీయుల శక్తిసామర్ధ్యాలను చాటిచెప్పిన విశిష్ట వ్యక్తి రామన్‌. రామన్ ఆశించినంతగా విజ్ఞాన రంగంలో మనం ముందుకు వెళ్లడం లేదు కానీ ఇటీవలి కాలంలో మనం సాధించిన విజయాలు తక్కువేం కాదు.

మన దేశం బడ్జెట్ లో చాలా కాలం పాటు శాస్త్ర సాంకేతిక రంగానికి ఎక్కువ కేటాయింపులు ఉండేవి కాదు. శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఆరోవేలుగా చూసేవారు. అయితే ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం బడ్జెట్ లో శాస్త్ర సాంకేతిక రంగానికి విశేషంగా బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నందున ఆ ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి.

మన దేశంలో 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్‌ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. 1928 ఫిబ్రవరి 28న సి.వి. రామన్‌ ”రామన్‌ ఎఫెక్ట్‌” కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. రామన్‌ పరిశోధనలు సైన్సులో ఒక క్రొత్త విభాగం. ”రామన్‌ స్పెక్ట్రోస్కోపీ” ఆవిర్భావం కారణంగా శాస్త్ర రంగంలోను, ఇండస్ట్రియల్‌ రంగంలోను కొత్తపుంతలు తొక్కడానికి దారితీసింది.

రామన్‌కు 1954లో ”భారతరత్న”, 1957లో ”లెనిన్‌ శాంతి బహుమతి” లభించాయి. సి.వి. రామన్‌ ఆప్టిక్స్‌లో కాంతి ప్రసరణపై జరిపిన పరిశోధనలకు నోబెల్‌ బహుమతి లభించింది. మెర్క్యూరీ ల్యాంప్ నుండి ఏకవర్ణ కాంతి తరంగాలను ఒక పారదర్శక యానకం గుండా ప్రసరింపజేస్తే, యానక ధర్మాలపై ఆధారపడి ఆ కాంతిలో కొంత భాగం వివర్తనం చెంది, తక్కువ తరంగధైర్ఘ్యం గల కాంతిగా బహిర్గతమౌతుంది.

సముద్ర జలంపై ఇదే ప్రక్రియతో నీలిరంగు కాంతి బహిర్గతమవుతుంది. దీనినే ‘రామన్ ఫలితం’ (రామన్ ఎఫెక్ట్) అంటారు. రామన్ ఫలితాన్ని ఉపయోగించి, యానక పదార్థం యొక్క నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. ఈ విధంగా ఎన్నో పదార్థాల స్ఫటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడింది. అంతటి మహానుభావుడిని స్మరించుకోవడం ఈ దేశ ప్రజలకుగా మనందరి కర్తవ్యం.

Related posts

విద్యల నగరంలో పిల్లలతో ముష్ఠెత్తుకుంటున్న గర్భిణులు

Satyam NEWS

జగన్ ను నమ్ముకుంటే పదవులకు కొదవ లేదు

Satyam NEWS

అసలు విషయం చెప్పింది సత్యం న్యూస్ ఒక్కటే

Satyam NEWS

Leave a Comment