అసెంబ్లీలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు యధాతథంగా ప్రస్తావిస్తూ నిపుణుల కమిటీ తన నివేదిక అందచేసింది. నిపుణుల కమిటీ చైర్మన్ జిఎన్ రావు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెక్రటేరియేట్ ను విశాఖపట్నం కు తరలించాలని సిఫార్సు చేసినట్లు చెప్పారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక ఇచ్చామని ఆయన తెలిపారు. అమరావతిలో వరద ముంపు నకు గురి అయ్యే ప్రాంతాలను వదిలేసి మిగిలిన భూములు వాడుకోవాలని సూచించినట్లు చెప్పారు. సెక్రటేరియట్ విశాఖపట్నం తరలించాలని, అక్కడ పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు హైకోర్ట్ మూడు బెంచ్‌లు కర్నూల్, విజయవాడ, విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినట్లు కూడా ఆయన చెప్పారు. ఆర్థిక పరిస్థితులు పరిగణలోకి తీసుకున్న తర్వాతే కమిటీ నివేదిక ఇచ్చామని ఆయన వివరించారు.
విశాఖలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయని, విశాఖ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన నగరం కాబట్టి రాజధానికి సిఫార్సు చేశామని ఆయన వివరించారు.