35.2 C
Hyderabad
April 24, 2024 11: 50 AM
Slider సంపాదకీయం

వైసీపీలో కలకలం రేపిన తెలంగాణ సీఎం వ్యాఖ్యలు

#kcr

ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ స్కెచ్ వేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో ఒక్క సారిగా వైసీపీ నాయకులు కంగుతిన్నారు. ఢిల్లీ బీజేపీ నాయకులు తమ చేతిలో ఉన్నారని, తాము ఏం చెప్పినా వింటున్నారని భావించిన వైసీపీ నాయకులకు కేసీఆర్ చెప్పిన వార్త మింగుడు పడటం లేదు.

ఢిల్లీ తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కూలుస్తామని ‘‘ఫామ్ హౌస్ కేసు’’ వీడియో టేపుల్లో ఉన్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకులలో అతి ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా ఉన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏ కీలకవిషయంలోనైనా సరే ఇరకాటంలో పడినప్పుడు ఈ ముగ్గురు నాయకులు మధ్యలో తెలుగుదేశం పై విమర్శలు గుప్పించి అధికార పార్టీని గట్టెక్కిస్తారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా తమకు ఎంతో బాగా సహకరిస్తున్నారని వైసీపీ నేతలు భావిస్తున్న తరుణంలో కేసీఆర్ చెప్పిన విషయాలు మింగుడు పడటం లేదు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసే అవకాశాలు ఉన్నా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమతో ఉంటే చాలని వైసీపీ నేతలు ఇంతకాలం భావించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆశీస్సులు ఉంటే రాబోయే ఎన్నికలలో కూడా తమకు అనుకూల వాతావరణం ఉంటుందని వైసీపీ నేతలు భావించారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కూడా వైసీపీ నాయకులు ఎప్పుడు కోరినా అప్పాయింట్ మెంట్ ఇచ్చి వారికి పూర్తి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన కొన్ని కేసులలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అడుగు ముందుకు వేయడానికి ఇవన్నీ అడ్డంకులుగా మారుతున్నాయి.

జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో వైసీపీకి సానుకూలంగానే ఉన్నాయి. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలబడింది. రాష్ట్రంలో ఆర్ధిక అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర సంస్థలే పలు దఫాలుగా ఫిర్యాదులు చేసినా, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) తప్పు పట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం నామ మాత్రపు విచారణ లు తప్ప ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు.

రాజకీయంగా చూసినా కూడా జనసేన పార్టీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా కూడా బీజేపీ నాయకులు అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఇదంతా వైసీపీ ఆదేశాల ప్రకారం జరుగుతున్నదేనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన విడిపోయి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నా కూడా ఆ ప్రయత్నాలను అడ్డుకునే చర్యలను బీజేపీ చేయడం లేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.

ప్రతిపక్ష ఓటులో చీలక లేకుండా చూడాలని అందరూ భావిస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చీలిక ఉండే విధంగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ కారణాలతో బీజేపీ తమతో పూర్తిగా ఉందని, తమపై ఈగవాలకుండా చూసుకుంటుందని వైసీపీ భావించింది. అయితే అకస్మాత్తుగా కేసీఆర్ బీజేపీ ఏపి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తుందనే విషయం వెల్లడించడంతో ఒక్క సారిగా వైసీపీ నేతల్లో ఆందోళన చెలరేగింది.

Related posts

టర్కీలో భూకంపం: 53 మంది మృతి

Bhavani

గ్రామీణ విలేకరులకు టిజెఎస్ఎస్ అవార్డులు

Satyam NEWS

ఉద్యోగులను నిలువునా ముంచుతున్న జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment