ఏపి డిప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ సెక్యూరిటీ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఘోరమైన ఈ తప్పిదం ముఖ్యుల సెక్యూరిటీ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నది. ఒక వ్యక్తి ఐపీఎస్ అధికారిలాగా వచ్చి పవన్ కల్యాణ్ సెక్యూరిటీలో కలిసిపోవడమే కాకుండా సెక్యూరిటీ అధికారులతో ఫొటోలకు ఫోజులు కూడా ఇవ్వడం రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నది. ఇంత డొల్లతనంగా వీఐపీలకు సెక్యూరిటీ ఉంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితే ఇలా ఉంటే ఇక ఇతరుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నది.
ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లాగా ఒక వ్యక్తి కలియ తిరిగాడు. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో మన్యం జిల్లా పోలీసులు ఎంక్వైరీ చేశారు. అతను నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అని తేలడంతో నిన్న రాత్రి విజయనగరం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.