సమాజ సేవకు, సంక్షేమానికి అంకితమైన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ, సేవా భారతి తన వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం ‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ 9వ ఎడిషన్ ను 2025 ఫిబ్రవరి 02 ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, టీ షర్ట్స్, బిబ్స్ ను ఫ్రీడమ్ ఆయిల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, జీ ఎం చేతన్, గ్లోబల్ డాటా డైరెక్టర్ స్వప్న మహేరియా, ప్రసన్న కాంత్, సేవా భారతి ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమలత, సంయుక్త కార్యదర్శి జయప్రద, సైబరాబాద్ సేవా భారతి అధ్యక్షురాలు ఉషా అయ్యర్, రన్ అంబాసిడర్ సరిత నర్మెట్ట, శ్రీనివాస్ తాడూరి, అఖిల్ తదితరులు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి, చేతన్ మాట్లాడుతూ, ఈ రన్ లో పాల్గొనేందుకు ఇప్పటికే 10 వేల మంది తమ పేరు నమోదు చేసుకున్నారన్నారు. సామాజిక బాధ్యతగా సేవా భారతి సంస్థ సేవలకు సహకారంగా ఉంటున్నoదుకు గర్వపడుతున్నామన్నారు. స్వప్న మహేరియా, ప్రసన్న కాంత్ లు మాట్లాడుతూ, సేవా భారతి సేవలను కొనియాడారు. బాలికల సాధికారత కోసం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. జయప్రద దేవి మాట్లాడుతూ, 2004 లో కేవలం 11 కేంద్రాలతో ప్రారంభమై, ఇవ్వాళ 300 కిషోరీ వికాస కేంద్రాలను ఏర్పాటు చేశాం అన్నారు.
డాక్టర్ సుమలత మాట్లాడుతూ, సమాజంలో ఉన్న అవసరాలను బట్టి వివిధ రంగాల్లో సేవా భారతి సేవలు అందిస్తున్నది. కిషోరీ వికాస యోజన తో సేవా భారతి చదువు, వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యంలో తోడ్పాటు ఇస్తున్నాం. సేవా భారతి 300 బస్తీల్లో 20 ఏళ్లుగా పని చేస్తోంది. ఇలాంటి వాటితోనే సమాజంలో మార్పు సాధ్యం. ఫిబ్రవరి 2న, గచ్చిబౌలి లో జరిగే 9వ విడత రన్ ఫర్ గర్ల్ చైల్డ్, మరియు ఫిబ్రవరి 1న అద్భుతంగా ఉండే ఉడాన్ ఉత్సవంలో పాల్గొనాలని, అదే ఉత్సవంలో రన్నర్స్ కు టీ షర్ట్స్, బిబ్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవాభారతి కిశోరి వికాస్ యోజన ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ లోని మురికి వాడల్లోని ఆడపిల్లల అభ్యున్నతికి కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కిశోరి వికాస్ యోజన ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ప్రతి ఏడాది 10 వేల మంది బాలికలకు సాధికారత కల్పించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2030 నాటికి లక్ష మంది ఆడపిల్లలకు భవిష్యత్ ప్రణాళికల ద్వారా సాధికారత సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.
ఈ రన్ కు సహకరిస్తున్న ఫ్రీడమ్ ఆయిల్, గ్లోబల్ డేటా, ఇన్ఫోసిస్, పాల్ టెక్, జీఈపీ, హెల్త్ ఎడ్జ్, ఫిల్ట్రేషన్ గ్రూప్, UST, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్, బీడీఎల్ వంటి సంస్థలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమాల ద్వారా తర్వాత జరిగే “రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్” కార్యక్రమంలో పాల్గొనాలని వివిధ కార్పొరేట్ సంస్థలను కోరారు. నిరుపేద ఆడపిల్లల భవిష్యత్ ను మార్చే లక్ష్యానికి సేవాభారతి కట్టుబడి ఉందని, మా లక్ష్యానికి ‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ కార్యక్రమం నిదర్శనమన్నారు.
అలాగే ‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ కార్యక్రమానికి దాతలు, రన్నర్లు అధికారిక వెబ్సైట్: www.runforagirlchild.org ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సేవాభారతి ఇతర సభ్యులు పిలుపునిచ్చారు. ఆసక్తిగల వారు మరిన్ని వివరాలకు అపర్ణ గారిని +91 98480 34767 సంప్రదించగలరని విజ్ఞప్తి చేశారు.