28.2 C
Hyderabad
February 27, 2024 20: 11 PM
Slider ప్రత్యేకం

సందేహాలు రేకెత్తించిన ప్రత్యేక దర్శనం స్కీమ్

Tirupati

తిరుమల తిరుపతి దేవస్థానంలో వృద్ధులకు దివ్యాంగులకు పసిపాపల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కోసం చేసిన ఏర్పాట్ల పై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. టిటిడి విడుదల చేసిన ప్రకటనను యథాతధంగా సత్యం న్యూస్ పోస్టు చేయగా, అందుకు సంబంధించి క్లారిఫికేషన్ల కోసం ఎంతో మంది అడుగుతున్నారు. సత్యం న్యూస్ వీక్షకులు టిటిడి ప్రకటనపై పలు సందేహాలు లేవనెత్తారు.

వాటి సారాంశం ఇది: 65 సంవత్సరాలకు పైబడిన వయోవృద్ధులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు టిటిడి ఆర్భాటంగా ప్రకటించింది. అయితే ప్రతి మంగళవారం ఈ దర్శనం ఉంటుందా? అనే అంశంపై స్పష్టత లేదు. 65 సంవత్సరాల వృద్ధుడు ఆయన భార్యతో సహా వస్తే, ఆయన భార్యకు 65 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉంటుంది కాబట్టి ఆమెను పంపుతారా లేదా? ఒక్కరినే పంపే విధంగా ఈ ప్రకటన ఉంది.

అదే విధంగా దివ్యాంగులకు తోడుగా వచ్చే సహాయకులను దర్శనానికి అనుమతిస్తారా లేదా? కేవలం దివ్యాంగులు ఒక్కరే వెళ్లాలంటే అది కుదిరేపనేనా? అదే విధంగా 5 సంవత్సరాల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా దర్శనం చేయిస్తామని  టిటిడి చెబుతున్నది. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వస్తే అందులో ఒక పిల్లవాడు లేదా పిల్లకు ఐదు సంవత్సరాల లోపు ఉండి మరొకరికి 5 సంవత్సరాలు దాటి ఉంటే దర్శనానికి ముగ్గురినే అనుమతించి మరో సంతానానికి అనుమతి నిరాకరిస్తారా అనే సందేహం వస్తున్నది.  

వయోవృద్ధులు(65 సంవత్సరాలకు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుందని చెబుతున్నారు. అంతకు మించి వస్తే దర్శనానికి అనుమతి ఇవ్వరా? ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది. బాగానే ఉంది. మరి టోకెన్లపై సీలింగ్ పెడితే ఎలా? ఆ తర్వాత వచ్చిన వారు మరో వారం పాటు దర్శనం కోసం వేచి ఉండాలా?  

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ  1400 టోకెన్లు జారీ చేస్తున్నారని, ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారని టిటిడి చెబుతున్నది. మరి ఇక్కడ క్యూ లైన్ ఉండదా? ఆ క్యూలైన్ లో వారే ఉండాలా? వారి తరపున ఎవరైనా వచ్చి టిక్కెట్లు తీసుకోవాలా? దీనిపై కూడా స్పష్టత లేదు. టోకెన్ల కోసం క్యూలైన్ లో ఉండి మళ్లీ ఆ తర్వాత నిర్దేశిత సమయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం అంటే మామూలుగా వెళ్లే దర్శనం కన్నా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది.

5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను అక్టోబ‌రు 16, 30వ‌ తేదీల్లో బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారని ప్రకటించారు. మరో పిల్లవాడు లేదా పాప 5 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉంటే ఏం చేయాలో చెప్పలేదు. టిటిడి చేసిన ప్రకటనకు సంబంధించి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ జరిగిపోయి ఉంటుంది. టిటిడి ప్రకటన నమ్ముకుని ఆశతో వచ్చిన వారికి నిరాశ తప్పదని అనిపిస్తున్నది. ఎన్నడూ లేనంత మంది బోర్డు సభ్యులను పెట్టుకుని ఈ విధమైన అసౌకర్యాలు గుర్తించకుండా అరకొర ఏర్పాట్లు చేయడం వల్ల అభాసుపాలు కావడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు. పెద్దవారికి, దివ్యాంగులకు, పసిపిల్లల తల్లిదండ్రులకు సులభంగా దర్శనం కల్పించాలని టిటిడి బోర్డు చిత్తశుద్ధితో ఆలోచిస్తే ఇలా రోజులు తేదీలు కాకుండా ప్రతి రోజూ ప్రత్యేక క్యూలైన్ లు ఏర్పాటు చేసి వారికి దర్శన భాగ్యం కల్పిస్తే మంచిది.

Related posts

మరో మూడు రోజులు వర్షాలు

Bhavani

రాజంపేట లో వైసీపీ గడపగడపకు మన ప్రభుత్వం…

Bhavani

31 న వ‌ర్చువ‌ల్ విధానంలో విజయనగరం వైద్య క‌ళాశాల శంకుస్థాప‌న‌

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!