పవర్ మన చేతుల్లో ఉంటే.. మనమే కింగులం. అదే పవర్ మన చేతుల్లో లేకుంటే… అవతలి వాడు ఏది చెబితే అది చేయాలి. ఇది అవకాశవాద రాజకీయం చేసే వాళ్లకు సరిగ్గా సరిపోతుంది. మరి ఆ అవకాశ వాద రాజకీయాలు చేసే వారు ఎవరు? ఇంకెవరు?… వైసీపీ వాళ్లే. ఎందుకంటారా?… వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీకి ఆది నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే చేస్తున్నారు.
మొన్నటిదాకా తన పార్టీ అదికారంలో ఉందని వసూల్ రాజా రాజకీయాలు చేసిన సాయిరెడ్ది.. ఇప్పుడు వైైసీపీ అదికారం నుంచి దిగిపోవడం, ఆ వెంటనే తాను గతంలో చేసిన అరాచకాలపై కేసులు నమోదు కావడంతో దెబ్బకు డంగైైపోయారు. ఈ క్రమంలో తనను తాను రక్షించుకునేందుకు కాళ్ల బేరానికి దిగిన సాయిరెడ్డి… అరగంట వ్యవధిలో ఏకంగా రూ.3 వేల కోట్లను తిరిగి ఇచ్చేసి… ఆ కేసుల నుంచి బయటపడిపోయారు. వైసీపీ అదికారంలో ఉండగా… కాకినాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్ లను జగన్ అండ్ కో ఎలా లాగేసుకున్నారన్న విషయం ఇప్పటికే వెల్లడైపోయింది.
ఈ వ్యవహారంలో సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. తొలుత కేవీరావుకు ఫోన్ చేసింది కూడా సాయిరెడ్డే. సాయిరెడ్డి ఫోన్ తోనే వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని కేవీ రావు కలిశారు. వారు బెదిరించడంతో ప్రత్యామ్నాయ మార్గం లేక వేల కోట్ల రూపాయల విలువ చేసే కాకినాడ సీపోర్టుతో పాటు కాకానిడ సెజ్ ను అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీలకు రాసిచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఎంత ఇస్తే.. అంతే తీసుకుని బతుకు జీవుడా అంటూ కేవీ రావు బయటపడ్డారు. ప్రాణాలు దక్కించుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయి… టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది కదా. కేవీ రావుకు ధైర్యం వచ్చింది.
నేరుగా సీఐడీ వద్దకు వెళ్లారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. రాతపూర్వక ఫిర్యాదూ చేశారు. ఇంకేముంది… సాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డి, చెన్నైకి చెందిన ఆడిట్ సంస్థలపై కేసులు నమోదు అయిపోయాయి. ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారిన నేపథ్యలో దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. సీఐడీ కామ్ గా ఉన్నా…ఈడీ కామ్ గా ఉండలేదు కదా. ఈ కేసును ఈడీ కాస్తంత లోతుగానే తవ్వుతోందట. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నందున తనకున్న ఢిల్లీ పరిచయాలతో ఈ విషయాలన్నీ తెలుసుకున్న సాయిరెడ్డి… కేవీ రావుతో కాళ్ల బేరానికి వచ్చారని సమాచారం.
ఇరు వర్గాలకు సన్నిహితులుగా ఉన్న కొందరి చొరవతో సాయిరెడ్డితో భేటీకి కేవీ రావు అంగీకరించగా… సాయిరెడ్డి పరుగు పరుగున వెళ్లి అక్కడ వాలిపోయారు. దఫాదఫాలుగా జరిగిన చర్చల్లో కేవీ రావుకు సాయిరెడ్డి సారీల మీద సారీలు చెబుతూనే ఉన్నారు. దీంతో చల్లబడిపోయిన కేవీ రావు… సరే అసలు సంగతేంటో చెప్పాలని తెలిపారు. కేవీ రావులో కోపం తగ్గిందని సంతోషించిన సాయిరెడ్డి… గతంలో జరిగిందేదో జరిగింది… దానిని మనసులో పెట్టుకోవద్దు అంటూ సాయిరెడ్డి ఆయన చేతులు పట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది…
మరి ఇప్పుడేం చేద్దామంటే… మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నాం… ఆ నష్టాన్నిభర్తీచేసేస్తాం అంటూ సాయిరెడ్డి ప్రతిపాదించారని సమాచారం.. అందుకు కేవీ రావు సరేననడంతో కాకినాడ సీ పోర్టులో లాగేసుకున్న వాటాలను అక్కడికక్కడే కేవీ రావుకు బదలాయించేశారు. అయితే కాకినాడ పోర్టు విషయాన్ని మాత్రం వదిలేయాలని సాయిరెడ్డి వేడుకోవడంతో… కేవీ రావు సరేలెమ్మంటూ వదిలేశారని తెలుస్తోంది…