38.2 C
Hyderabad
April 25, 2024 14: 17 PM
Slider నిజామాబాద్

బీఆర్ఎస్..  బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ

#sharmila

బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ అని వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్టిపి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర కామారెడ్డికి చేరుకుంది. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో షర్మిలకు జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు.

రామేశ్వర్ పల్లి పెట్రోల్ బంక్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. సిరిసిల్ల రోడ్డు నుంచి గంజ్ గేట్ రైల్వే స్టేషన్, నిజాంసాగర్ చౌరస్తా, దేవునిపల్లి మీదుగా లింగాపూర్ గ్రామం వరకు పాదయాత్ర కొనసాగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

గతంలో ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసి శిలాఫలకం వేయడంతో దానికి కూల్చేసిన విషయంపై షర్మిల ఫైర్ అయ్యారు. శిలాఫలకం కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ఆర్ అంటే గుండెనిండా అభిమానంతో వచ్చిన అశేష జనవాహినికి ధన్యవాదాలు తెలిపారు. 5 సంవత్సరాలు సీఎంగా ఉన్న వైఎస్ఆర్ సీఎం అంటే ఇలా ఉండాలి అని మాదిరిగా పనిచేసారన్నారు.

అందుకే కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారన్నారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, పేద బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్, కార్పోరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందేలా ఆరోగ్యశ్రీ, 108 సేవలు, 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించిన ఘనత దివంగత వైఎస్ఆర్ దేనన్నారు. ప్రపంచంలోనే ఏ నాయకుడైన ఇలా ఆలోచించారా అని ప్రశ్నించారు. కేసీఆర్ నాలుగు లక్షల ఇళ్లయినా కట్టించాడా అని ప్రశ్నించారు.

మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్, ఎస్సి, ఎస్టీలకు ప్రభుత్వ భూములు అందించి పట్టాలు ఇచ్చిన ఘనత వైరస్ఆర్ కే దక్కిందన్నారు. 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా గ్యాస్, విద్యుత్, బస్ చార్జీలు పెంచలేదన్నారు. ఎలాంటి ధరలు పెంచకుండా అద్భుత పాలన చేసిన రికార్డ్ సీఎం వైఎస్ఆర్ అన్నారు. మరి సీఎం  కేసీఆర్ పాలన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 8 సంవత్సరాలలో రెండుసార్లు సీఎంను చేస్తే అన్ని ధరలు పెంచారని తెలిపారు.

ఇది పేదల ప్రభుత్వమేనా.. అని నిలదీశారు. పేద వాని నడ్డివిరిచే కార్యక్రమం తప్ప పేదల గురించి ఏనాడైనా ఆలోచన చేసారా అని ప్రశ్నించారు. కేసీఆర్ జన్మకు ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అని నిలదీశారు. సున్నా వడ్డీకి మహిళ సంఘాలకు రుణాలు, కేజీ టు పీజీ, ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం, 57 ఏళ్లకే పింఛన్ హామీలు అమలు చేసారా అని ప్రశ్నించారు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు అని కేసిఆర్ ప్రగల్బాలు పలికారని, ఇప్పుడు అల్లుడు వస్తే ఫామ్ హౌస్ కు పంపిద్దామన్నారు.

ప్రాణహిత చేవెళ్ల పథకం చేపట్టి 20,21,22 ప్యాకేజి ద్వార లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని వైఎస్ ఆర్ చేసారని, కేసీఆర్ ఒక్క ఏకరానికైనా నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు. రిడిజైన్ పేరుతో నీళ్లు రాకుండా చేసిన కేసీఆర్ కు ఏమనాలి అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ పాదయాత్ర సమయంలో ఈ ప్రాంతంలో నీటి సమస్య ఉందని గుర్తించి 200 కోట్లతో పైప్ లైన్ వేసి నీళ్లు ఇచ్చారని, కామారెడ్డి పథకాన్ని నేడు కేసీఆర్ కాపీ కొట్టి మిషన్ భగీరథ చేపట్టారని విమర్శించారు.

వైఎస్ఆర్ కామారెడ్డిలో 20 వేల ఇల్లు కట్టించారని, 22 సబ్ స్టేషన్లు, స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేశారని, ఇక్కడి నాయకుడు షబ్బీర్ అలీని మంత్రిని చేశారన్నారు. ఆ తర్వాత ఏ నాయకుడైన ఇక్కడి వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 30 వేలు ఇచ్చే పథకాన్ని బొందపెట్టి 5 వేలు రైతుబంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆ డబ్బు దేనికైనా సరిపోతుందా అని ప్రశ్నించారు.

వరి వేస్తే ఉరే అన్న సీఎం ఎక్కడైనా ఉన్నారా.. అని ప్రశ్నించారు. పంట నష్టపోతే ఒక్కరూపాయి కూడా పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు 60 ఏళ్లకే చనిపోవాలట అన్నారు. 60 ఏళ్ల లోపు ఉన్న రైతులు చనిపోతేనే రైతుభిమా ఇస్తారట అన్నారు. కేసీఆర్ కు ఇప్పుడు 69 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆయన సీఎం అయ్యాడని, ఇప్పుడేమో రాజ్యాలు ఎలుతాడట అని ఎద్దేవా చేశారు.

ఆయన బాత్ రూంకు బులెట్ ప్రూఫ్ పెట్టుకున్నారని, ఆయన ప్రాణానికి అంత విలువ అని, రైతేమో 60 ఏళ్లకే చావాలా అని ప్రశ్నించారు. కళ్ళముందు 2 లక్షల ఉద్యోగాలు కనిపిస్తున్నా కేవలం 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నాకు ఉద్యమం తప్ప ఏది వద్దు అని చెప్పిన కేసీఆర్ తెలంగాణ వచ్చాక కుటుంబం మొత్తాన్ని రాజకీయాల్లోకి దించి అందరికి పదవులు కట్టబెట్టారని అన్నారు.

ఉద్యోగాల గురించి అడిగితే ఓ మంత్రేమో తెలంగాణలో హమాలి పనికి మించిన పని లేదని అంటారన్నారు. 5, 6 తరగతి చదివిన వాళ్ళు కూడా మంత్రి కావచ్చు కానీ డిగ్రీ పిజిలు చేసిన యువత హమాలి పని చేయాలా అని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపించిన కేసీఆర్ అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఖూనీ చేసి 35 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం 15 లక్షల మంది ఎదురు చూస్తున్నారని, 35 వేల కోట్ల బకాయిలు రీయింబర్స్మెంట్ కు బకాయి ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఏనాడైనా సమస్యల మీద ప్రభుత్వాన్ని ఆడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నా అడిగే నాయకులే లేరన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్టిపి నిలదిస్తుందన్నారు. దొంగ చేతికి తాళం ఇస్తే మొత్తం దోచుకున్నారని, మిగులు రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు.

ఇంత అప్పు తెస్తే దేనికైనా డబ్బు ఉందా అని ప్రశ్నించిన షర్మిల బీడీ బిచ్చం.. కల్లు ఉద్దేర మాదిరిగా ప్రభుత్వ పాలన ఉందని ఎద్దేవా చేశారు. అప్పు తెచ్చిన డబ్బంతా ఏమైందని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేర్లు చెప్పి, కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తీసుకుంటూ విమానాలు, హెలిక్యాప్టర్లు కొంటుంన్నారని ఆరోపించారు. పంచాయతీలు నడపడానికి డబ్బు లేదని అంటే బీరు సీసాలు అమ్మి నడపాలని ఓ మంత్రి అంటారని అన్నారు.

బంగారు తెలంగాణ అని బ్రతుకు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, ఆరేళ్ళు, పదేళ్ల చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే కేసీఆర్ ఉరేసుకుని చచ్చిపోవాలన్నారు. మహిళలు, చిన్నారుల జోలికొస్తే తోలు తీస్తా, గుడ్లు పీకేస్తా అన్న సీఎం పబ్ లో ఎమ్మెల్యే కొడుకు అమ్మాయిపై అత్యాచారం చేసిన ఘటనపై ఎంతమంది తోలు తీశారని, ఎవరి గుడ్లు పీకేసారని ప్రశ్నించారు.

కేసీఆర్ కు బీఆర్ఎస్ బాగా సూటయ్యింది

బీఆర్ఎస్ పేరు కేసీఆర్ కు బాగా సూటయ్యిందని షర్మిల ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని, బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ అని తనదైన శైలిలో విమర్శించారు. ఈ పేరుతో ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్ చేస్తామంటున్నారన్నారు. తెలంగాణ మోడల్ అంటే ఏంటని ప్రశ్నించారు.

మిగులు బ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయ‌డ‌మా.. ఆడ‌వారికి ర‌క్షణ లేకుండా చేయ‌డం తెలంగాణ మోడ‌లా.. ఇచ్చిన ఒక్క మాట నిల‌బెట్టుకోక పోవ‌డం తెలంగాణ మోడ‌లా.. రైతులు చ‌నిపోయినా…విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నా.. ప‌ట్టించుకోక పోవ‌డం తెలంగాణ మాడ‌ల్ క‌దా.. ఇదేనా తెలంగాణ మోడ‌ల్..? అని ప్రశ్నించారు. ఇక్క‌డ ఏనాడు రైతుల‌ను ప‌ట్టించుకున్న‌ది లేదు… విద్యార్థుల‌కు బ‌రోసా నింపింది లేదు.. ఇక్క‌డ దిక్కులేదు కాని, ఇప్పుడు దేశాలు ఏల‌బోతాడ‌ట‌ అని విమర్శించారు. టిఆర్ఎస్  పార్టీ కాస్త బీఆర్ఎస్ అయ్యింది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వవిఆర్ఎస్ అవుతుంది.. మొత్తం రిటైర్ మెంట్ ఇచ్చి కేసీఆర్ ను ఫామ్ హౌజ్ లో కూర్చోబెట్టాలన్నారు.

గంప గోవర్ధన్ ను గంపలో కప్పేయండి

ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను గంపవేసి కప్పేయండి అంటూ షర్మిల అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏమైనా చేశాడా అని నిలదీశారు. సొంత ఇల్లు కూడా లేదని, సానుభూతి ఓట్లతో గెలిచి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మూడంతస్తుల భవనాన్ని కట్టుకున్నారని ఆరోపించారు. గంప గుత్త‌గా అన్నింటిలో ఆయ‌న‌కే క‌మీష‌న్లు వస్తాయట.. మైనింగ్ లు, ఆర్అండ్ బి, ఇసుక మాఫియా అన్నింట్లో గంప గుత్త‌గా క‌మీష‌న్లు తీసుకుంటారట కదా అని విమర్శించారు. సారు బాగా సంపాదించాడ‌ట‌. ఆయ‌న ఇంటికి బీటి రోడ్డు కూడా ప్ర‌భుత్వ సోమ్మేన‌ట‌ అని ఆరోపించారు. అబ్దుల్లానగర్ శివారులో 100 ఎక‌రాలు ప్ర‌భుత్వ భూములు క‌బ్జా చేశారని, వెంచర్ల పేరుతో వేల‌కోట్లు సంపాదించాడ‌ట‌ అన్నారు. పోశ‌మ్మ పోగు చేస్తే మైస‌మ్మ మాయం చేసిన‌ట్లు రాజివ్ స్వ‌గ్రుహ ఫ్లాట్లు కూడా అమ్ముకున్నారని ఆరోపించారు.

ఒక జ‌ర్న‌లిస్ట్ ఈయ‌న అవినీతిపై వార్త‌లు రాస్తే పోలీస్ స్టేష‌న్లో పెట్టి కొట్టించాడ‌ట.. ఇప్పుడు ఆ జ‌ర్నలిస్ట్ మ‌తి స్థిమితం లేకుండా ఉన్నాడ‌ట‌ అని తెలిపారు. ఇది ప్ర‌జాస్వామ్య‌మా.. అరాచ‌క రాజ్యమా అని ప్రశ్నించారు. ఇలాగే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తయారయ్యారని విమర్శించారు.

కేంద్రంలోని బీజేపీ ఏం చేస్తోంది

రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ ఏం చేస్తుందని షర్మిల ప్రశ్నించారు . కేసీఆర్ ల‌క్ష 20వేల కోట్ల కాలేశ్వ‌రం అవినీతిపై బీజేపి ద‌గ్గ‌ర ఆదారాలు ఉన్నాయని, కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడావాటిని భ‌య‌ట పెట్ట‌డం లేదన్నారు. క‌నీసం ఎంక్వైరి కూడా వేయ‌లేదని తెలిపారు. మీకు మీకు లావాదేవిలు లేక‌పోతే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదని ప్రశ్నించారు. తన ప్ర‌శ్న‌కు బీజేపి స‌మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వైఎస్ఆర్ పథకాలను అమలు చేస్తా

‘వైఎస్ఆర్ బిడ్డగా నేను మీకోసం వస్తున్నా.. వైఎస్ హయాంలో ఉన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తా.. ఆశీర్వదించండి. కాంగ్రెస్, బీజేపీ అధికార పార్టీని ప్రశ్నించడం లేదు. తెలంగాణలో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి చూపించడానికే పాదయాత్ర చేపట్టా.. నా కుటుంబాన్ని వదిలి, ఎండనక, వాననక మీకోసం పాదయాత్ర చేస్తున్న.. నన్ను ఆశీర్వదించండి. అని షర్మిల ప్రజలను కోరారు.

Related posts

హనుమంత వాహనంపై సీతారామలక్ష్మణులు….

Satyam NEWS

పన్ను విధానాన్ని రద్దు చేయాలని టీడీపీ నేతల వినతి పత్రం

Satyam NEWS

మద్యం అమ్మకాల వల్లే పెరుగుతున్న కరోనా

Satyam NEWS

Leave a Comment