మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రానందున రెండవ అతిపెద్ద పార్టీ అయిన శివసేనను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖతను, బలాన్ని తెలియజేయాలని ఆ పార్టీ సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండేకు సమాచారమిచ్చారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా నిర్ణయం తెలపాలని గవర్నర్ సూచించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరిగినట్లయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ బిజెపిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఇతర నాయకులు ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలిశారు. శివసేన తమతో కలిసి రావడం లేదని, సంఖ్యా బలంలేని కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని ప్రకటించారు. నిన్నటితో అసెంబ్లీ పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ బిజెపిని ఆహ్వానించారు. సోమవారం లోగా బలనిరూపణ చేసుకోవాలని సూచించారు. దీంతో బిజెపి తమ ఎమ్మెల్యేలను కొనేస్తుందేమోననే ఉద్దేశ్యంతో మిగిలిన పార్టీలు జాగ్రత్త పడ్డాయి. ముంబయిలోనే శివసేన ఎమ్మెల్యేలు ఓ హోటల్‌లో మకాం వేయగా.. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్ తరలించింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు గానూ బిజెపి 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
previous post