కేంద్రంలో బిజెపితో అధికారం పంచుకుంటున్న శివసేన అక్కడ కూడా తెగతెంపులు చేసుకున్నది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శివసేన నాయకుడు భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో గవర్నర్ శివసేనను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే శివసేనకు కాంగ్రెస్, ఎన్సీసీల మద్దతు తప్పనిసరి. శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ఆ పార్టీ ఎన్‌డీయే నుంచి బయటకు రావాల్సిందేనని ఎన్‌సీపీ షరతు విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరవింద్ సావంత్ రాజీనామా అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాను కేంద్ర కేబినెట్‌లో కొనసాగలేనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర పరిణామాలపై కొందరు లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారని, శివసేనదే సరైన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంతో గవర్నర్ కోషియార్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీని ఆహ్వానించారు. అయితే తమ మిత్రపక్షమైన శివసేన అంగీకరించడం లేదని, తమవద్ద తగిన సంఖ్యా బలం లేదని బీజేపీ గవర్నర్‌కు తేల్చి చెప్పేసింది. దీంతో బీజేపీ, శివసేన కూటమికి బీటలు వారింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తన కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
previous post