34.2 C
Hyderabad
April 19, 2024 19: 55 PM
Slider సంపాదకీయం

Shocking News: తెలుగు సినిమా నిర్మాణం బంద్

#telugufilmindustry

ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సినిమా టిక్కెట్ రేట్లను నియంత్రించాలని తీసుకున్న నిర్ణయం తెలుగు చలన చిత్ర పరిశ్రమను పగబట్టి వెంటాడుతున్నది. దీనికి తోడు కరోనా అనంతరం సినిమా ధియేటర్లు తెరుచుకున్నా కూడా ప్రేక్షకులు రాకపోవడం ‘గోరు చుట్టుపై రోకటి పోటు’ లా మారింది.

ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఓటీటీ (ఓవర్ ది టాప్) కంపెనీలు విపరీతపోకడలు పోతుండటంతో తెలుగు చిత్ర పరిశ్రమ మూతపడే స్థితికి చేరుకుంటున్నది. ఈ పరిస్థితిలో ఏం చేయాలి? అనే అంశం తెలుగు సినీ నిర్మాతలను వెంటాడుతున్నది.

రాబోయే ఆరు నెలల కాలం పాటు సినిమా నిర్మాణం నిలిపివేయాలని తెలుగు సినీ నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పెద్ద, మధ్య తరగతి, చిన్న సినిమాలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వేలాది మంది ఆర్టిస్టులే కాకుండా లక్షలాది మంది ఇతర టెక్నీషియన్లు, అన్ స్కిల్డ్ వర్కర్లు చిత్ర సీమ కారణంగా ఉపాధి పొందుతున్నారు.

కరోనా కాలంలో దాదాపు రెండు సంవత్సరాల పాటు చిత్ర పరిశ్రమ వర్కర్లకు జీవనోపాథి కరవైంది. ఇప్పుడిప్పుడే చిత్ర నిర్మాణం వేగం పుంజుకుంటున్న తరుణంలో నిర్మాత కష్టాలకు మాత్రం అంతుచిక్కడం లేదు. వేతనాలు పెంచాలని సినీ కార్మికులు సమ్మె చేయడం నిర్మాతకు మరింత భారంగా మారింది. అగ్ర హీరోలు రెమ్యూనరేషన్లు బాగా తగ్గించుకున్నారు.

అయినా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. సినీ ప్రేక్షకుడి నుంచి ఎగ్జిబిటర్ వరకూ బాహుబలి, కేజీఎఫ్ స్థాయి చిత్రాలను ఆశిస్తున్నారు. దాంతో నిర్మాతలు ఏదో కొత్త దనం చూపించేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. పరిస్థితి ఈ వైపునకు దారితీస్తున్న సమయంలోనే కలెక్షన్లు ఎక్కువగా వచ్చే ఆంధ్రా, రాయలసీమ ఏరియాలపై జగన్ దెబ్బ కొట్టారు.

సినీ టిక్కెట్ల రేట్లను ప్రభుత్వం నియంత్రిస్తున్నది. తమకు కావాల్సిన నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు టిక్కెట్ రేట్లు భారీగా పెంచుకోవడానికి, ఐదు లేదా ఆరు షోలు వేసుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. తమ వద్దకు రాలేని నిర్మాతల సినిమాలకు అతి తక్కువ రేట్లు దక్కుతున్నాయి.

దాంతో సినిమా ధియేటర్ల నుంచి రాబడి రావడం లేదు. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని ఓటీటీ ప్లాట్ ఫామ్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ కంపెనీలు మరిన్ని కఠినతరమైన నిబంధనలు పెడుతున్నాయి.

కొన్ని సినిమాలకు ముందే సగం పెట్టుబడి పెట్టి, సినిమా పూర్తి కాగానే పూర్తి హక్కులు సొంతం చేసుకుంటున్న ఓటీటీ కంపెనీలు కూడా ఉన్నాయి. దాంతో సినిమా తీసే నిర్మాతకు ఒక్క పైసా కూడా మిగలడం లేదు. కరోనా అనంతర పరిణామాల వల్ల సినీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోవడం, టిక్కెట్ రేట్లపై జగన్ ప్రభుత్వం కొట్టిన దెబ్బ, ఓటీటీ కంపెనీల విచిత్ర నిబంధనలు నిర్మాతను నష్టాల చక్రబంధంలో విలవిలలాడేలా చేస్తున్నాయి.

ఆడుతుందో ఆడదో కూడా తెలియని సినిమాపై కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేతులు కాల్చుకోవడం అవసరమా? అనే ప్రశ్న నిర్మాతలను వెంటాడుతున్నది. కలెక్షన్లు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా ప్రభుత్వాలు, ఓటీటీ కంపెనీలు అడ్డుకొడుతుంటే ఇక ఏం చేయాలనే విచిత్ర పరిస్థితిలో తెలుగు చలన చిత్ర నిర్మాతలు ఉన్నారు. అందుకే ఆరు నెలల పాటు సినిమా నిర్మాణం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. హిందీ తర్వాత అంత భారీగా ఖర్చు చేసే తెలుగు సినిమా ఆగిపోతే లక్షలాది మంది రోడ్డున పడతారు.

Related posts

ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు

Satyam NEWS

టీడీపీ లీగల్ సెల్ కు నూతన కార్యవర్గం

Satyam NEWS

మాజీ రేషన్ డీలర్ కు ఉచిత వైద్యం చేసిన చదలవాడ

Satyam NEWS

Leave a Comment