32.2 C
Hyderabad
April 20, 2024 20: 00 PM
Slider హైదరాబాద్

ఎస్ఐ దాష్టీకం.. మహిళపై దాడి..

pjimage

ముంపు బాధితుల ఆర్థిక స‌హాయం కాస్తా ప‌క్క‌దారి ప‌డుతుండ‌డంతో బాధితుల ఆక్రోశం తీవ్ర‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. జ‌ల్‌ప‌ల్లిలో బాధితుల‌కు ఆర్థిక స‌హాయం అంద‌క‌పోవ‌డంతో ఆయా చోట్ల స్థానిక నేత‌ల‌ను ముంపు బాధితులు ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీస్తున్నారు. సోమ‌వారం క‌ళ్యాణ‌ల‌క్ష్మీ చెక్కుల‌ను పంపిణీ చేయ‌డానికి వ‌చ్చిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డికి త‌మ గోడు వెళ్ల‌బోసుకునేందుకు ముంపు బాధితులు క్యూక‌ట్ట‌డంతో ఈ విష‌యాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఈ నేప‌థ్యంలో స్థానికుల‌కు పోలీసుల‌కు వాగ్వాదం కూడా చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

శ్రీ‌రామ కాల‌నీ మ‌హిళ‌పై ఎస్ఐ దాడి.. ఆందోళ‌న‌

శ్రీ‌రామ కాల‌నీ 19, 20 వార్డుల‌కు చెందిన ప‌లువురు ముంపు బాధితుల‌కు ఆర్థిక స‌హాయం అంద‌లేద‌ని మంత్రికి విన్న‌వించుకునేందుకు వెళ్ల‌గా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా, స్థానిక మ‌హిళ‌ల‌పై ప‌హాడీష‌రీఫ్ ఎస్ఐ కుమార‌స్వామి లాఠీలు ఘ‌ళిపించాడు. దీంతో కోపోద్రిక్తులైన వార్డు ప్ర‌జ‌లు శ్రీ‌రామ కాల‌నీలోని ఎస్‌బీఐ బ్యాంక్ మెయిన్‌రోడ్డుపై ధ‌ర్నా నిర్వ‌హించారు. స్థానిక ఎస్ఐ దాష్టీకాన్ని నిల‌దీయాల‌ని, ఎస్ఐ మ‌హిళ‌ల‌పై దాడి చేయ‌టం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

వాక‌బు చేసిన ప‌లువురు నేత‌లు..

కాగా ఎస్ కుమార‌స్వామి దాడి విష‌యాన్ని తెలుసుకున్న ప‌లువురు స్థానిక నేత‌లు, పోలీసులు వ‌చ్చి ప‌రిస్థితిని స‌ద్దుమ‌ణిగేలా చేద్దామ‌ని తీవ్రంగానే ప్ర‌య‌త్నించ‌గా ఇందుకు బాధితులు ఒప్పుకోలేదు. ఎస్ఐ వ‌చ్చి క్ష‌మాప‌ణ చెప్పేవ‌ర‌కూ క‌దిలేది లేద‌ని భీష్మించుకున్నారు.

ఎస్ఐపై ప‌లు ఆరోప‌ణ‌లు..

స్థానిక ఎస్ఐ కుమార‌స్వామిపై ఇదివ‌ర‌కే ప‌లు ఆరోప‌ణ‌లున్నాయి. ఎవ్వ‌రినీ ప‌డితే వారిని గొడ్డును బాధిన‌ట్లు బాధుతాడ‌ని, వ‌సూళ్ల ప‌ర్వానికి తెర‌తీస్తాడ‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నాడు.

లాక్‌డౌన్‌లోనూ ప‌లువురు మ‌హిళ‌ల‌పై దాడులు చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉన్నతాధికారులు ప్ర‌క‌టిస్తున్న‌ప్ప‌టికీ స్థానికంగా ఉన్న కొంద‌రు పోలీసుల్లో మాత్రం మార్పు రాక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని స్థానికులు వాపోయారు.

బాధితుల క‌థ‌నం..

కాగా బాధితురాలు మ‌నీషా, ఆమె భ‌ర్త బాబులు, బంధువులు మాట్లాడుతూ.. ఎస్ఐ క‌ర్ర‌తో బాధ‌డంతో చేతికి దెబ్బ‌లు త‌గిలాయ‌ని మ‌హిళ అని కూడా చూడ‌కుండా ఇలా దాడి చేయ‌టం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల్సిన పోలీసులే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.

ఎస్ఐపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితులు డిమాండ్ చేశారు. కాగా ధ‌ర్నా జ‌రిగిన ప్రాంతానికి వ‌చ్చిన స్టేష‌న్ సిఐ విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి బాధితుల‌తో మాట్లాడి ఒప్పించే ప్ర‌య‌త్నం చేయ‌గా బాధితులు ఎస్ఐ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

దీంతో గంద‌ర‌గోళానికి తెర‌లేచింది. ఓ వైపు ట్రాఫిక్ స్థంభించిపోగా మ‌రోవైపు ధ‌ర్నా నినాదాల‌తో ఆ ప్రాంతం మారుమోగింది. అనంత‌రం పోలీసు ఉన్న‌తాధికారులు క‌లుగ‌జేసుకోవ‌డంతో బాధితులు శాంతించి ధ‌ర్నా విర‌మించారు.

Related posts

“సైబరాబాద్ ప్రొటెక్షన్ గ్రూప్/CPG” ఏర్పాటు

Satyam NEWS

ఈనెల 25న రానున్న లవ్ & సస్పెన్స్ థ్రిల్లర్ నేనెవరు

Satyam NEWS

పరిపాలన లో న్యాయస్థానాల జోక్యం తగదు

Satyam NEWS

Leave a Comment