సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ ఉపాధి ఎక్కువగా లభించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నదే తన లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారుస్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండలం మందపల్లి శివారులోని పారిశ్రామిక వాడలో శుక్రవారం సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పర్యటించారు. పారిశ్రామిక వాడలోని పరిశ్రమలు, ప్రముఖ డీఎక్స్ఎన్ పరిశ్రమ అభివృద్ధి పనుల పురోగతిని సవివరంగా వివరించారు.
మందపల్లి పారిశ్రామిక వాడలో 322 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు, ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలని, పెద్ద ఎత్తున్న పరిశ్రమలు రావాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. 322 ఎకరాలలో ముండ్రాయి, మందపల్లి, మిట్టపల్లి, రాజగోపాల్ పేట ఈ 4 గ్రామాల శివారులో ఏర్పాటు చేసుకున్న ఈ పారిశ్రామిక వాడలో వచ్చే పరిశ్రమలతో నియోజక వర్గం పరిధిలోని 6 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
ఇప్పటికే డీఎక్స్ఎన్ కంపనీ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతూ శర వేగంగా పని చేస్తున్నదని ఉత్పత్తులను త్వరలోనే అందుబాటులో తేనున్నట్లు తెలిపారు. అదే విధంగా పెన్నార్, అంబికా అగర్ బత్తి పరిశ్రమను నెలకొల్పాలని ఆ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చారని, ఆయా పరిశ్రమతో 3 వేల మంది మహిళలకు ఉపాధి లభించే అవకాశం ఉన్నదని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ సోదరుడు కండక్టర్ శ్రీనివాస్ ఇటీవల బస్సు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు మంత్రి పరామర్శించి ఓదార్చారు.