Slider తెలంగాణ ముఖ్యంశాలు

బీజేపీ కొత్త వ్యూహంతో బిగ్ డ్యామేజ్

singareni

ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీగా ఎదిగేంతవరకు టీఆర్ఎస్‌కు అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలిచింది ఉత్తర తెలంగాణ. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎప్పుడు ఉపఎన్నికలకు వెళ్లినా అభ్యర్థులను గెలిపించి ఉద్యమానికి ఊపిరిలూదింది. ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత కూడా ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ పట్టు కొనసాగుతూ వస్తోంది. రాష్ట్ర సాధన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే లోక్‌సభ ఎన్నికల నుంచి కథ అడ్డం తిరగడం మొదలుపెట్టింది. టీఆర్ఎస్‌కు కంచుకోట అయిన కరీంనగర్‌లో బీజేపీ కాషాయ జెండా ఎగిరింది.

కరీంనగర్‌తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌లలోనూ ఆ పార్టీ సిట్టింగ్ స్థానాలు గల్లంతయ్యాయి. ఉత్తర తెలంగాణలో మూడు లోక్‌సభ స్థానాల్లో గెలుపు బీజేపీకి ఎక్కడ లేని బూస్టింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టి పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా తాజాగా సింగరేణి కార్మికులను బీజేపీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మొత్తం ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో ప్రత్యక్షంగా 60వేల పైచిలుకు కార్మికులు ఉన్నారు.

సింగరేణి కుటుంబాలను కూడా కలుపుకుంటే.. వీరి ఓట్లు లక్షల్లో ఉంటాయి. కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా ఉన్న సింగరేణి కార్మికుల్లో మెజారిటీ కార్మికులు ఇప్పటివరకు టీబీజీకేఎస్ ద్వారా టీఆర్ఎస్‌కు అండగా నిలబడుతూ వచ్చారు. అయితే ఉత్తర తెలంగాణలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడు టీబీజీకేఎస్‌ను విచ్చిన్నం చేసే పనిలో పడింది.

టీబీజీకేఎస్‌కు గుర్తింపు సంఘం హోదా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యను బీజేపీ తమవైపుకు తిప్పుకుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. రేపే మాపో ఆయన టీబీజీకేఎస్‌ను వీడి బీజేపీ అనుబంధ సంఘం భారతీయ మజ్దూర్ యూనియన్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరబోతున్న మల్లయ్య ఇప్పటికే ఆరు జిల్లాల్లోని గని కార్మికులను కలిసి మద్దతు కూడగట్టినట్టు కథనాలు వస్తున్నాయి.

అదే జరిగితే టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్‌లో బిగ్ డ్యామేజ్ తప్పదన్న వాదన వినిపిస్తోంది. సింగరేణి కార్మికులపై టీఆర్ఎస్ పట్టు కోల్పోతే ఆరు జిల్లాల్లో టీఆర్ఎస్‌పై ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ఉత్తర తెలంగాణలో విస్తరించడానికి సింగరేణిని మించిన మార్గం లేదని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.అటు టీబీజీకేఎస్‌ను టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తూ వస్తుండటం కూడా ఆ సంఘం నేతల్లో అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది.

మొత్తం మీద ఉత్తర తెలంగాణలో గట్టి పట్టు సాధించడానికి బీజేపీ సింగరేణి అస్త్రాన్ని బలంగా వాడుకోవాలని నిర్ణయించింది. మరి బీజేపీ వ్యూహాలను టీఆర్ఎస్ తిప్పికొడుతుందో లేదో వేచి చూడాలి.

గుమ్మడి  శ్రీనివాస్

Related posts

ఆస్తి కోసం  క‌న్న‌వారు చేసిన కిరాత‌కం…!

Satyam NEWS

ఐక్యరాజ్య సమితి సమావేశాలకు నరేంద్రమోడీ?

Satyam NEWS

బంగారు, వెండి పతకాలు సాధించిన పోలీసు జాగిలాలు

Murali Krishna

Leave a Comment