కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లు బంద్ అయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశం మొత్తంలో అన్ని వాణిజ్య, వ్యాపార, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమో, స్వీయ ఆంక్షల మేరకో బంద్ పాటిస్తుంటే సిర్పూర్ పేపర్ మిల్లు మాత్రం జనతా కర్ఫ్యూ రోజు కూడా తెరిచి ఉంచిన వైనాన్ని సత్యం న్యూస్ పాఠకుల, పాలకుల దృష్టికి తీసుకువచ్చింది.
కార్మికులు కూడా తమ ఆరోగ్యంపై తీవ్ర మైన ఆందోళన చెందారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గుంపులు గుంపులుగా తిరగవద్దని, మనిషికి మనిషికి మూడు అడుగుల దూరం ఉండాలని చెబుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికి అర్ధం అయ్యేలా చెప్పినా కూడా సిర్పూర్ పేపర్ మిల్లు మాత్రం అప్పుడు పాటించలేదు. తాజాగా కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పేపర్ మిల్లు ని ప్రస్తుతం మూసివేసినట్లు యజమాన్యం నిన్నటి తేదీతో నోటీసులు పెట్టింది.
నేటి ఉదయం యధా ప్రకారం విధులకు వచ్చిన కార్మికుల్ని యాజమాన్యం ఇంటికి పంపించింది. కార్మికులతో పనిచేయించకుండా ఈ నెల 31 వరకూ యాజమాన్యాలు జీతాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.