తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. వైకుంఠ దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడడంతో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. టికెట్ల కోసం భక్తులు పెద్దఎత్తున రావడంతో టీటీడీ సిబ్బంది పద్మావతి పార్కు నుంచి క్యూలైన్‌లోకి వారిని ఒక్కసారిగా వదిలారు. దీంతో శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో తమిళనాడు కు చెందిన మల్లిక సహా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మల్లిక అనే మహిళను ముందుగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం రుయాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. తొక్కిసలాటలో గాయపడిన మిగిలి వారిని సిమ్స్, రుయాకు తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు భక్తులు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే తాజాగా స్విమ్స్‌లో చికిత్సపొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య ఆరుకు చేరింది.