అసలే సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అడ్డంగా బుక్కైపోయారు..దేశం వదిలి పారిపోయే అవకాశం కూడా లేకుండాపోయింది.. ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలాంటి వితప్కర పరిస్థితిలో కూడా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇంచార్జీ సజ్జల భార్గవ రెడ్డి మరింత దుస్సాహసానికి ఒడిగట్టిన తీరు నిజంగానే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తనను బుక్ చేసిన పోలీసులను ఇరుకున పెట్టేలా పక్కా ప్లాన్ వేసిన భార్గవ రెడ్డి…ఆ ప్లాన్ కాస్తా రివర్స్ కావడంతో మరింత చిక్కుల్లో పడిపోయారు. తప్పు చేసి ఆపై తమనే టార్గెట్ చేస్తారా? అంటూ ఏపీ పోలీసులు ఇప్పుడు భార్గవరెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాకుండా తమను ఇరుకున పెట్టేందుకు యత్నించిన తాజా ఘటనలో భార్గవ రెడ్డితో పాటుగా ఆయనకు సహకరించిన పార్టీకి చెందిన ఇతర నేతలపైనా సరికొత్త కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.
ఈ వ్యవహారంలో భార్గవ రెడ్డి మరింత ఊబిలో కూరుకుపోయారని చెప్పక తప్పదు. ఏపీ పోలీసులను చిక్కుల్లో పడేసేందుకు భార్గవ రెడ్డి రచించి అమలు పరచిన వ్యవహారంలోకి వెళితే… తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న యామత్తి సుబ్బారావును మొన్నామధ్య మఫ్టీలో వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి తన వివరాలను రాబట్టే దిశగా యత్నించే క్రమంలో సుబ్బారావుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని భార్గవ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సుక్బారావు నుంచి ఫిర్యాదు అందుకున్న విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు… దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో భార్గవ రెడ్డి అసలు రూపం వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పన్నపేటకు చెందిన సుబ్బారావును ఈ నెల 2న రాత్రి వేళ…మఫ్టీలో వెళ్లిన టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు ఆయన ఇంటి నుంచే అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా భార్గవ రెడ్డి ఆచూకీ చెప్పాలంటూ సుబ్బారావును పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు కూడా పుకార్లు వినిపించాయి. పోలీసుల థర్డ్ డిగ్రీ నేపథ్యంలో సుబ్బారావు నడవలేని పరిస్థితిలో ఉన్నారని ఫొటోలు కూడా విడుదలయ్యాయి.
అయితే పోలీసుల విచారణలో భాగంగా ఈ నెల 2న అసలు సుబ్బారావు తన ఇంటిలోనే లేనట్లుగా తేలింది. దీంతో మరింత లోతుగా దర్యాప్తు సాగగా…అసలు నిజం బయటపడింది. ఎన్టీఆర్ జిల్లాలోని ఉయ్యూరు మండలం అరట్లకట్టకు చెందిన మహిళను వివాహం చేసుకున్న సుబ్బారావు.. ఈ నెల 2న అత్తగారి ఇంటిలో ఉన్నట్టుగా సెల్ ఫోన్ సిగ్నల్స్ తెలిపాయి. అంతేకాకుండా తనను అరెస్ట్ చేసిన సమయంలో తన ఇంటిలోనే ఉన్న తన భార్య, పిల్లలను కూడా పోలీసులు బెదిరించారని కూడా సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసలు ఆ రోజు అటు సుబ్బారావు గానీ, ఆయన భార్య, పిల్లలు అసలు సింహాద్రి అప్పన్నపేటలోనే లేరన్న విషయాన్ని నిర్ధారించుకున్న పోలీసులు…ఏడాదిగా తన తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సుబ్బారావు భార్య ఏడాదిగా అరట్లకట్టలోనే ఉంటున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇక ఈ నెల 2న బెజవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్దనున్న మిషనరీ ఆసుపత్రి బస్టాప్ లో కూర్చున్న సుబ్బారావును మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరురాలు చంద్రలీల తన స్కూటీపై ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయాన్ని కూడా పోలీసులు పసిగట్టారు.
ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజీలోనూ సుబ్బారావు అక్కడ చికిత్స తీసుకున్న దృశ్యాలు వెలుగుచూశాయి. మొత్తంగా సుబ్బారావు అసలు అరెస్టే కాలేదని, పోలీసులను ఇరికించేందుకు వైసీపీ నేతలు రచించిన స్కెచ్ ప్రకారం డ్రామాను సుబ్బారావు రక్తి కట్టించారని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా తవ్వగా… ఈ నెల 1న సుబ్బారావు వైసీపీకి చెందిన కీలక నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జునలతో పలుమార్లు ఫోన్ లో సంభాషించినట్లుగా కాల్ డేటాను పోలీసులు వెలికి తీశారు.
దీంతో వైసీపీకి చెందిన పెద్ద నేతలు రచించిన వ్యూహం మేరకే సుబ్బారావు అరెస్ట్, ఆయనపై పోలీసుల థర్డ్ డిగ్రీ తదితర ఘటనలు చోటుచేసుకున్నట్లుగా పక్కా డ్రామాను సుబ్బారావు రక్తి కట్టించారు. అయితే అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక దర్యాప్తు పద్దతుల ద్వాారా అసలు నిజం ఇట్టే బయటపడిపోతుందని అటు సుబ్బారావు గానీ, ఇటు పథకాన్ని రచించిన వైసీపీ నేతలు కూడా గ్రహించలేకపోయారు.
మరోవైపు పోలీసులను నిలువరించడంతో పాటుగా వారిిన ఆత్మరక్షణలో పడేసేందుకు వైసీపీ నేతలు ఆడిన నాటకంతో ఇప్పుడు పోలీసులు వారిపై రగిలిపోతున్నారు. వెరసి భార్గవ రెడ్డితో పాటు ఈ ప్లాన్ రచన, అమలులో సకరించిన వైసీపీకి చెందిన ఇతర నేతలు, పాత్రధారి సుబ్బారావుపై కఠిన సెక్షన్లతో కూడిన కేసులను నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ దెబ్బతో భార్గవ రెడ్డి ఇక తప్పించుకోలేరన్న వాదనలు వినిపిస్తున్నాయి.