స్మార్ట్‌ఫోన్ల ద్వారా 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. ఇండియాలో డిజిటల్ విప్లవాన్ని ప్రశంసించిన ఆయన గ్రామీణ ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవలను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని కొనియాడారు. గతంలో భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేవి కావని, కానీ ఇప్పుడు పేమెంట్స్ అందుకోవడం, బిల్లులు చెల్లించడం వంటివి స్మార్ట్‌ఫోన్ ద్వారా చిటికెలో చేస్తున్నారని పేర్కొన్నారు. ‘డిజిటలైజేషన్ అనేది వేగవంతమైన అభివృద్ధికి కారణం అవుతుంది. ఉదాహరణకు భారత్‌నే తీసుకోండి. గత ఐదారేళ్లలో స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా 80 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసింది’ అని ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. ప్రస్తుత, భవిష్యత్తు తరాల కోసం జీరో హంగర్ (ఆకలి లేని) దిశగా వేగంగా పురోగతి సాధించడం అనే అంశంపై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)లో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
previous post