నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి రూపురేఖలు అనతికాలంలోనూ సమూలంగా మారిపోనున్నాయి. ఈ సంక్రాంతి తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఈ మేరకు ఆయా పనులకు ఇప్పటికే అటు రాష్ట్ర కేబినెట్ తో పాటు సీఆర్డీఏలు ఆమోద ముద్ర వేశాయి. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేయాల్సిన కసరత్తులు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా టెండర్ల ప్రక్రియకు రంగం సిద్ధం కాగా… ఈ పనులను చేపట్టేందుకు ఎంపిక అయ్యే కంపెనీలు, ప్రభుత్వం మధ్య వారధిలా వ్యవహరిస్తూ సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చూసేందుకు ఓ కన్సల్టెన్సీని కూడా సీఆర్డీఏ ఎంపిక చేయనుంది. అంతేకాకుండా రాజధానికి ప్రైవేట్ పెట్టుబడులను ఇబ్బడిముబ్బడిగా రాబట్టే దిశగా పనిచేసే మరో కన్సల్టెన్సీని కూడా ఖరారు చేసే పనిని సీఆర్డీఏ మొదలుపెట్టింది. ఈ కన్సల్టెన్సీ సంస్థ… ఇటు రాజధాని అమరావతికి ప్రైవేట్ పెట్టుబడులను రాబట్టడంతో పాటుగా…ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగేలా వ్యవహరించనున్నట్లు సమాచారం.
ప్రైవేట్ పెట్టుబడులను అమరావతికి తీసుకువచ్చే గురుతర బాధ్యతను నిర్వర్తించే కన్సల్టెంట్ కోసం ఇప్పటికే సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లకు ప్రపంచంలోని ప్రఖ్యాత ఆర్థిక సంస్థల నుంచి బిడ్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో సింగపూర్ కు చెందిన సంస్థలు అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యంతో పాటుగా… అమరావతి నిర్మాణానికి హోల్ అండ్ సోల్ కన్సల్టెంట్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా సింగపూర్ తో పాటు పలు అగ్ర దేశాలకు చెందిన ఆర్థిక సంస్థలు కన్సల్టెన్సీ టెండర్లలో పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఈ టెండర్ ప్రక్రియకు భారీ ఎత్తున స్పందన లభించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక కన్సల్టెన్సీ కంపెనీగా ఎంపికయ్యే సంస్థ… రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక భూమిక పోషించనుంది. అమరావతిలో ఏఏ రంగాలు అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయి?…ఆయా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం.. ఇందుకోసం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కీలక నగరాల్లో సదస్సులు నిర్వహించడం…ఆయా సంస్థలను అమరావతికి తీసుకుని వచ్చి… ఇక్కడి పెట్టుబడి అవకాశాలను వారికి వివరించడం… రాజదానిలో పెట్టుబడులు పెట్టేలా ఆయా కంపెనీలను ఒప్పంచడం వంటి కీలక పనులను ఈ కన్సల్టెన్సీ సంస్థ చేపట్టనుంది.
ఇక కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయడంతోనే తన బాధ్యత అయిపోయిందన్న దిశగా ఆలోచించకుండా… రాజధాని అమరావతి సర్వతోముఖాభివృద్ధితో పాటుగా సత్వర అభివృద్ధికి బాటలు వేసే దిశగా సీఆర్డీఏ కీలక చర్యలు చేపట్టనుంది. ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణలో రాజదాని ప్రాంతాన్ని ఓ అంశంగా… రాజధాని అమరావతి ప్రాంత పరిధిని రెండో అంశంగా పరిగణించి… పెట్టుబడులు రాబట్టే దిశగా కన్సల్టెన్సీ సంస్థను సీఆర్డీఏ మోటివేట్ చేయనుంది. ఫలితంగా అమరావతితో పాటుగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అమరావతితో పాటే అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఫలితంగా భవిష్యత్తులో అమరావతిని రాష్ట్రంలో ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దనుంది. సీఆర్‌డీఏ అనుకున్నవన్నీ ఇప్పటిదాకా పక్కాగానే… నిర్దేశిత లక్ష్యాలమేరకే సాగుతున్నాయి. ఎక్కడ కూడా నిర్దేశిత లక్ష్యాల సాధన వీలు కాలేదన్న మాటే రాలేదు. అంటే… భవిష్యత్తుల్లో రాజధాని ప్రాంతంతో పాటుగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో లెక్కలేనన్ని విదేశీ కంపెనీల ప్రాజెక్టులు కనిపించనున్నాయని చెప్పక తప్పదు. ఫలితంగా ఒక్క అమరావతికే లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పోటెత్తనున్నాయన్న మాట.